అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్… ట్రంప్ చేత ప్రమాణం చేయించారు. కాగా, అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, జేడీ వాన్స్ కూడా అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, వాషింగ్టన్‌లో తీవ్ర చలి కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవనంలో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వేడుక వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
అమెరికా ఫస్ట్ తన నినాదం అంటూ… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్.. కార్యక్రమానికి హాజరైన ఆహుతులను ఉద్దేశించి మాట్లాడారు.
ఆయన ప్రమాణ స్వీకారానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. నేటి నుంచి అమెరికాలో స్వర్ణయుగం ప్రారంభం కానుందన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తాం అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతుందన్నారు.