అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో ట్రంప్ దోషిగా తేలారు. ఈ మేరకు ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని న్యూయార్క్ జ్యూరీ తీర్పును వెలువరించింది.
ఇంకో 5 నెలల్లో జరగనున్న 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని చూస్తున్న డొనాల్ట్ ట్రంప్‌నకు.. తాజా తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. సంబంధిత కేసు కోసం మాన్హాటన్లోని కోర్టుకు వెళ్లిన ట్రంప్.. జడ్జి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయారు. కానీ.. కోర్టు బయటకు వచ్చి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రభుత్వం తన మీద చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కోర్టులో కూడా రిగ్గింగ్ జరిగిందని.. కానీ నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల అనంతరం ప్రజలే నిజమైన తీర్పును ఇస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు…
అమెరికాలో మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం చాలా అరుదైన ఘటన. కానీ.. దోషిగా తేలినప్పటికీ, చట్టాల ప్రకారం ట్రంప్.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. పోర్న్ స్టార్‌తో కేసులో ఆయనకు జైలు శిక్ష పడినా.. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగొచ్చు. ఈ కేసుకు సంబంధించి.. జులై 11న కీలక తీర్పును వెలువరించనుంది న్యూయార్క్ కోర్టు. సరిగ్గా అందుకు కొన్ని రోజుల ముందే.. మిల్వాకీలో రిపబ్లికెన్ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. ఈ ఈవెంట్లో డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్‌పై పోటీకి.. డొనాల్డ్ ట్రంప్‌ని రిపబ్లిక్ పార్టీ అధికారికంగా ఎంపిక చేసే అవకాశం ఉంది! మరోవైపు.. పోర్న్ స్టార్ కేసులో ట్రంప్ దోషిగా తేలడంపై బైడెన్ బృందం స్పందించింది. చట్టానికి ఎవరూ అతీతం కాదని రుజువైంది అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్యానికి ట్రంప్ పెను ముప్పుగా మారారు అని ఆ ప్రకటన వివరించింది.
జ్యూరీకి ధన్యవాదాలు తెలిపిన జస్టిస్ మెర్చన్..
పోర్న్ స్టార్ హష్ మనీ కేసులో.. రెండు రోజుల్లో 11గంటల పాటు చర్చించిన 12మంది సభ్యుల జ్యూరీ.. చివరికి.. 34 నేరాభియోగాల్లో ట్రంప్ దోషి అని ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ఇంతటి ఒత్తిడితో కూడిన కఠినమైన టాస్క్‌ని తీసుకున్న జ్యూరీకి.. జస్టిస్ మెర్చన్ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు పోర్న్ స్టార్ కేసు ఆద్యంతం.. సంబంధిత జ్యూరీ సభ్యుల ఐడెంటిటీని రహస్యంగా దాచి పెట్టారు! ఇది చాలా అరుదైన విషయం. మాఫియా, హింసపూరిత కేసుల్లోనే ఇలా జరుగుతుంది.
స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ కేసు ఏంటి?
డొనాల్డ్ ట్రంప్ తనతో 2006లో శృంగారంలో పాల్గొన్నట్టు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ చెప్పారు. అయితే.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇది మైనస్ అవుతుందని భావించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ఆమెకు డబ్బులు ఇచ్చినట్టు, సంబంధిత రికార్డులను ధ్వంసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల చుట్టూ ప్రాసిక్యూషన్ బలమైన కేసును బిల్డ్ చేసింది! ట్రంప్ తన నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు దాచిపెట్టారని ఆరోపించింది. ట్రంప్ తరఫు న్యాయవాదులు మాత్రం.. ఈ వాదనను కొట్టిపారేశారు. ఎన్నికలను ప్రభావితం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో భాగమన్నారు.
ట్రంప్ కేసు.. అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం ఎంత?
డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తుందా ? అన్న విషయంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కైథ్ గడ్డీ స్పందించారు. ఇదంతా చూసి ప్రజల మనసు మార్చుకోకపోవచ్చు. కానీ కొన్ని స్వింగ్ స్టేట్స్లో ఓటర్లు ఆలోచనల్లో పడొచ్చు. ట్రంప్ మార్జిన్లు ప్రభావితం అవ్వొచ్చని చెప్పుకొచ్చారు.