Saturday, November 23, 2024

మార్కెట్‌కు వార్‌ ఫీవర్‌.. వరుసగా నాల్గో రోజూ నష్టాల్లో..

దేశీయ మార్కెట్‌ సూచీలు వరుసగా నాల్గో రోజు (సోమ‌వారం) కూడా నష్టాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,551.65 పాయింట్ల వద్ద నెగిటివ్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,141.96 – 57,167.02 పాయింట్ల మధ్యే కదలాడింది. చివరికి 149.38 పాయింట్ల నష్టంతో 57,683.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,192.25 పాయింట్ల వద్ద నష్టాలతోనే ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,351.05-17,070.70 మధ్య కదలాడింది. చివరికి 69.65 పాయింట్లు నష్టపోయి 17,206.65 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.58 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మారుతీ, నెస్లే ఇండియా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌ షేర్లు నష్ట పోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఐటీసీ కారణంగా సెన్సెక్స్‌ నష్టపోయింది.

రంగాల వారీగా చూసుకుంటే.. బ్యాంకింగ్‌ సూచీ మాత్రమే స్వల్ప లాభాల్లో ముగిసింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, యుటిలిటీస్‌, మెటల్‌, పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, బేసిక్‌ మేటీరియల్స్‌, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు భారీగా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 సూచీలో 12 షేర్లు లాభపడగా.. 38 షేర్లు నష్టపోయాయి. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో.. తిరిగి గిరాకీ రానుందన్న అంచనాల మధ్య హోటల్స్‌ రంగ షేర్లు లాభాల్లో పయనించాయి. చాలెట్‌ హోటల్స్‌ షేర్లు 20 శాతం వరకు లాభపడ్డాయి.

నష్టాలకు ఇదీ కారణం..

మార్కెట్‌ను ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు భయపెడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో సూచీలు కాస్త కోలుకున్నప్పటికీ.. ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం ఇవే భయాలతో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఐరోపా మార్కెట్లు నెగిటివ్‌గా ప్రారంభమైనప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్‌ వివాదానికి పరిష్కారం లభించే అవకాశం ఉందన్న అంచనాలతో కొంత పుంజుకున్నాయి. పుతిన్‌-బైడెన్‌ మధ్య భేటీతో సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావించాయి. దీంతో భారత్‌ సహా అంతర్జాతీయ సూచీలు కొంత సానుకూలంగా కదలాడాయి. కానీ బైడెన్‌తో సమావేశంపై రష్యా ప్రతికూలంగా స్పందించడంతో.. ఉన్న కాస్త లాభాలు ఆవిరయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement