మాస్కో, ప్రభన్యూస్ : ఉక్రెయిన్‌పై దాడికి ముందే రష్యా అనేక జాగ్రత్తలు తీసుకుందని తేలిపోయింది. నల్లసముద్రంపై తనకు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన నౌకాస్థావరాన్ని కాపాడుకునేందుకు అరుదైన జాగ్రత్తలు తీసుకుంది. 2014లో క్రిమియాను ఆక్రమించినపుడు, సిరియాలో కార్యకలాపాలకు ఈ నౌకాస్థావరాన్నే రష్యా కేంద్రంగా చేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులకు సుదూరంగా ఉండటం వల్ల భూ, వైమానిక దాడులకు అవకాశం తక్కువే అయినప్పటికీ సముద్రజలాల ద్వారా దాడులు జరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తపడింది. సోవియట్ కాలంనంచి రష్యాకు అత్యంత కీలకంగా ఉన్న సెవాస్టోపోల్ నౌకాస్థావరం.. నల్లసముద్రంపై పట్టుకు తార్కాణంగా ఉంది. దేశానికి చెందిన అనేక యుద్ధ నౌకలు ఇక్కడే మోహరించి ఉంటాయి. వాటిని కాపాడుకునేందుకు, శత్రు జలాంతర్గాముల కదలికలను పసిగట్టే పనిని డాల్ఫిన్ దళాలకు రష్యా అప్పగించింది. ఆధునిక యుద్ధవ్యూహాల్లో భాగంగా డాల్ఫిన్ సైన్యాన్ని రష్యా నిర్వహిస్తోంది. వాటికి ప్రత్యేక సైనిక శిక్షణ, ఆయుధాలు, ప్రత్యర్థులు ప్రయోగించే పేలుడు పదార్థాలు, జలాంతర్గాముల కదలికలను పసిగట్టేలా వాటికి ప్రత్యేక తర్ఫీదునిచ్చింది.
పదుల సంఖ్యతో కూడిన డాల్ఫిన్ దళాలను (సమూహాలను) ఏర్పాటు చేసింది. అలాంటి కొన్ని దళాలను సెవాస్టొపోల్‌లో మోహరించింది. అవి నౌకల చుట్టూ తిరుగుతూ, సముద్రంలో పహారా కాశాయి. ఈ విషయాన్ని యూఎస్ నేవల్ ఇన్‌స్టిట్యూట్ (యూఎస్‌ఎన్) వెల్లడించింది. నౌకల సమీపంలో డాల్ఫిన్ల సంచారానికి సంబంధించిన ఉపగ్రహాలు తీసిన ఛాయా చిత్రాలను ఆధారాలుగా చూపింది. ఫిబ్రవరి మొదటివారంనుంచి డాల్ఫిన్ల దళాలు రక్షణ విధుల్లో పాల్గొన్నాయని ఆ సంస్థ పేర్కొంది. అంటే, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి కొద్ది రోజుల ముందన్నమాట. డాల్ఫిన్లకు సహజంగా ఉన్న ఎకోలొకేషన్, సోనార్ లక్షణాల ఆధారంగా సహజ విరుద్ధమైన వస్తువులు, పదార్థాలను అవి తేలికగా గుర్తిస్తాయి. వాటి సునిశిత గ్రహణ శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందంటే… గోల్ఫ్ బాల్‌కు, పింగ్‌పాంగ్ బాల్‌కు తేడానుకూడా అవి ఇట్టే గ్రహిస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..