Friday, November 22, 2024

మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న డాలర్‌, చమురు ధరలు..

స్టాక్‌ మార్కెట్‌ను డాలర్‌, చమురు ధరలు ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో వీటితో పాటు అమెరికా బాండ్స్‌ ఏ మేరకు రాబడిని ఇస్తాయన్న అంశంపై కూడా మార్కెట్ల తీరు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్‌ తరువాత కోలుకుంటున్న సమయంలో ద్రవ్యోల్బణం మార్కెట్‌ను దెబ్బతీసింది. ప్రపంచంలోని అన్ని ప్రధానమైన దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. అమెరికాలో 40 సంవత్సరాల కనిష్టస్థాయికి వృద్ధిరేటు పడిపోయింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఫలితంగా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచింది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్‌మార్కెట్లపై పడింది. దేశీయ మార్కెట్లు వరసగా గత వారం రోజులు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌సి సెన్సెక్స్‌ వారం రోజుల్లో 2,943 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 15,300 దిగువకు పడిపోయింది. రెండు సంవత్సరాల్లో ఇదే అత్యధిక పతనం. ఆర్థిక సంక్షోభం రానుందన్న భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఈ సంవత్సరం విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వచ్చే వారం మరోసారి వడ్డీ రేట్లను పెంచనుందని వార్తలు వస్తున్నాయి. దీని ప్రభావం ఈ వారం కూడా మార్కెట్లపై పడే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం సెన్సెక్స్‌ 5.42 శాతం పతనమై, 51,360.42 పాయింట్ల వద్ద శుక్రవారం నాడు ముగిసింది. బిఎస్‌సి మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1194.39 పాయింట్లు లేదా 5.31 శాతం పతనం అయ్యాయి. బిఎస్‌సి స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1723.54 పాయింట్లు నష్టపోయింది. ఇది 6.67 శాతం తగ్గి 24,133.88 వద్ద ముగిసింది. నిఫ్టీ50 ఇండెక్స్‌ 908.30 పాయింట్లు నష్టపోయింది. అంటే 5.61 శాతం కుంగి, 15,293.50 పాయింట్ల వద్ద శుక్రవారం ముగిసింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. జులై 26,27 తేదీల్లో జరిగే సమావేశంలో ఫెడరల్‌ బ్యాంక్‌ మరో 0.75 పాయింట్లు వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే పెద్ద సవాల్‌ గా ఉందని మార్కెట్స్‌ మోజో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ఈ వారం కూడా గ్లోబల్‌ మార్కెట్ల తీరుపై , ముఖ్యంగా అమెరికా మార్కెట్ల వ్యవహరించే తీరుపైనే మన మార్కెట్లు స్పందిస్తాయని ఆయన చెప్పారు. ఇందుకు ముఖ్యంగా ముడి చమురు ధరలు, డాలర్‌ విలువపై ఆధారపడి ఉందన్నారు.

ఈ వారం జాతీయంగా , అంతర్జాతీయంగా ముఖ్యమైన మార్పులకు సంబంధించిన ఎలాంటి ఈవెంట్‌ లేనందున మార్కెట్లను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని నిపుణులు అభిప్రాయపడ్డారు. డాలర్‌ రేటు పెరడగం వల్ల ఇతర కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతుందని, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. డాలర్‌ రేటు పెరిగితే చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఖర్చు పెరుగుతుందని, దీని ప్రభావం అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్ధాల రేట్లపై పడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని, ఇప్పుడు ఇదే అతి పెద్ద సవాల్‌గా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాడు బ్యాంకర్లతో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నిర్వహించే సమావేశం ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై ఉంటుందని భావిస్తున్నారు. ఈ సవేశంలో వంద కోట్లు అంతకంటే ఎక్కువగా ఉన్న మొండి బకాయిల గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. బ్యాంక్‌లు ఇప్పటికే లాభాల్లో ఉన్నందున ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు స్టాక్‌ మార్కెట్‌లో బ్యాంకింగ్‌ షేర్లు లాభపడేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ వారం కూడా డాలర్‌తో రూపాయి విలువ పై నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. రూపాయి మరింత బలహీనపడుతుంటే విదేశీ ఇన్వెస్టర్లు మరింత ఎక్కువగా అమ్మకాలు జరిపే అవకాశం ఉంది. శుక్రవారంతో ముగిసిన గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. శుక్రవారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.05 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు ప్రపంచ మార్కెట్ల తీరును కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయన్న విషయం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్ల తీరు మనపై ఎక్కువ ప్రభావం చూసే అవకాశం ఉంది. ప్రధానంగా నిఫ్టీ 50 ఇండెక్స్‌ అప్పర్‌ సైడ్‌లో 15,600 వద్ద నిరోధకం ఉంటుందని హెచ్‌డిఎఫ్‌సి టెక్నికల్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి అభిప్రాయపడ్డారు. అయితే దిగువన ఈ ఇండెక్స్‌ 15000-14800 వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎక్కువగా మార్కెట్లు దిగువకు ఉండే సూచనలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement