హైదరాబాద్, ఆంధ్రప్రభ: డిగ్రీలో సీట్లు ప్రతీ ఏటా పూర్తిస్థాయిలో నిండట్లేదు. దీంతో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది సీట్లలో కోత విధించినా 3,86,544 సీట్లలో భర్తీ అయినవి కేవలం 2,12,818 మాత్రమే. 2021-22లో మొత్తం 1088 కాలేజీల్లో 4,68,880 సీట్లకు నిండినవి 2,55,132 మాత్రమే. అదేవిధంగా 2020-21లో 1103 కాలేజీల్లోని 4,54,703 సీట్లకుగానూ 2,47,601 భర్తీ అయ్యాయి. అలాగే 2019-20లో 4,28,480 సీట్లకు 2,15,467, 2018-19లో 1151 కాలేజీల్లోని 4,43,269 సీట్లకు 2,33,946 సీట్లు నిండాయి. ఇలా ప్రతీ ఏటా డిగ్రీలో చాలా తక్కువ సీట్లు భర్తీ అవుతున్నాయి. డిగ్రీ ప్రవేశాలకు ఆదరణ తగ్గుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తున్నట్లుగా కనబడుతోంది. ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.
ఇటీవల విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో మొత్తం 2,95,550 మంది విద్యార్థులు పాసయ్యారు. దీంట్లో దాదాపు 2 లక్షల మందికిపైగా మాత్రమే డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మిగతా వారు ఇంజనీరింగ్, ఇతర కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. డిగ్రీలో సీట్లు భారీగా మిగులుతుండడంతో 4.66లక్షల సీట్లలో దాదాపు 80 వేల సీట్లను గతేడాదిలో ఉన్నత విద్యామండలి కోత విధించగా డిగ్రీలో ప్రస్తుతం ఉన్న మొత్తం సీట్లు 3.86 లక్షలకు చేరాయి. ఈ విద్యాసంవత్సరం ఈ సీట్లకు అడ్మిషన్లను చేపట్టనున్నారు. అయితే ఈసారి సీట్లు భారీ స్థాయిలో భర్తీ అయ్యేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఉపాధి కోర్సులను ప్రవేపెట్టింది. బీఎస్సీ ఆనర్స్, ఇంటర్న్‌షిప్, ఐటీ సంబంధిత ఉపాధి కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈక్రమంలో ఈసారైనా డిగ్రీలో సీట్లు ఏమేరకు నిండుతాయో చూడాల్సి ఉంది. డిగ్రీ కోర్సుపై మొదటి నుంచి విద్యార్థుల్లో పెద్దగా క్రేజ్‌లేకపోవడంతో ప్రతీ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ గడువును ఉన్నత విద్యామండలి మూడు నాలుగు సార్లు పొడిగిస్తూ వస్తున్నా బీటెక్‌లో చేరుతున్నారు గానీ సాధారణ సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు ఇష్టపడట్లేదు. డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. నాలుగు దశల్లో సీట్లను కేటాయిస్తారు. మరోవైపు సీట్లు మిగలడంతో పాటు కాలేజీల సంఖ్య కూడా తగ్గిపోతోంది.
సీట్లు నిండక దాని ప్రభావం కళాశాలలపై పడుతుండటంతో నిర్వహణ భారం పెరిగి కళాశాలలు మూతపడే స్థితికి చేరుతున్నాయి. 2022-23లో 1073 కాలేజీలుంటే 2021-22లో 1088 ఉన్నాయి. ఈఏడాది 1054 మాత్రమే ఉన్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా ఇంటర్‌లో విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ కావడం, పాస్ మార్కులు కలపడం లాంటివి జరిగాయి. దాంతో డిగ్రీలో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఎంసెట్ సీట్ల కేటాయింపును బట్టి డిగ్రీలో అడ్మిషన్లు పెరగనున్నాయి. ఎంసెట్‌లో సీటు రానివారు డిగ్రీలో చేరుతున్నారు. ఆర్ట్స్ లాంటి కోర్సుల్లో చాలా మంది విద్యార్థులు చేరడంలేదు. దాంతో సీట్లు కాలేజీల్లో మిగిలిపోతున్నాయి.