అత్యవసర పరిస్థితుల్లో తమ చిన్నారులకు వైద్యం కోసం నీలోఫర్ ఆస్పత్రికి వచ్చే తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చుక్కులు చూపిస్తున్నారు. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నా… నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఉద్దేశ్యపూర్వకంగా శస్త్ర చికిత్సలను వాయిదా వేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ చిన్నారులను తీసుకుని నీలోఫర్ ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రులకు వైద్యుల వైఖరిని చూస్తే.. ప్రయివేటుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రిలో వివిధ వ్యాధులతో వచ్చే చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు నాలుగు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. నీలోఫర్‌లో 90శాతం మంది వైద్యులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే నిర్వహిస్తారని , ఆతర్వాత పత్తాకు లేకుండా పోతారని చెబుతున్నారు.
నగరంలోని పేరొందిన చిన్న పిల్లల ఆస్పత్రుల్లో నీలోఫర్ వైద్యులు భాగస్వాములని, అక్కడే ఎక్కువ సేపు వైద్యం అందిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శస్త్రచికిత్స, ఇతర అత్యవసర వైద్యానికి నీలోఫర్‌లో అయితే కొద్దికాలం వేచి చూడాల్సిందేనని, వేచి చూడలేకపోతే తాము సూచించిన ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లాలని స్వయంగా వైద్యులే రోగులను రిఫర్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
మరోవైపు నీలోఫర్ ఆస్పత్రిలో ఏళ్లుగా కార్డియాలజీ(గుండె జబ్బుల) విభాగం లేదు. గుండె జబ్బుల చిన్నారుల కేసులను ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. తీరా ఉస్మానియాకు వెళితే అక్కడ చాంతాడంత క్యూ ఉండడం, చిన్నారుల అవస్థలను చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారని ప్రజాసంఘాలు, రోగుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ పరిస్థితిలో నీలోఫర్‌లో ఆపరేషన్ల సంఖ్యను రెండింతలు చేయాలని, అత్యవసర శస్త్రచికిత్సలను వాయిదా వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రి వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital