Sunday, November 17, 2024

Delhi | సాహిత్య అకాడమీ కార్యదర్శికి డాక్టరేట్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన  డి.లిట్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) లభించింది. భారతీయ భాషలకు, సాహిత్యానికి విశేషమైన సేవలు అందించడంతో పాటు దాదాపు రెండు దశాబ్దాలుగా కేంద్ర సాహిత్య అకాడమీని అభివృద్ధి పథంలో నడిపించినందుకు గుర్తింపుగా ఆయనకు చత్తీస్‌గఢ్‌లోని షహిద్ మహేంద్ర కర్మ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్ లో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన జరిగిన గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు డి.లిట్. డిగ్రీ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శ్రీ వాస్తవ ఇతర ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పెదప్రోలు గ్రామానికి చెందిన కృత్తివెంటి శ్రీనివాసరావు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిషులో డాక్టరేట్ చేశారు.

పలు గ్రంధాలు వెలువరించారు. దేశ విదేశాల్లో వందలాది సాహిత్య కార్యక్రమాలలో ప్రసంగించారు. భారత సాంస్కృతిక శాఖకు చెందిన ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శి హోదాలో శ్రీనివాసరావు దాదాపు రెండు దశాబ్దాలుగా విశేషమైన సేవలందిస్తున్నారు. పురస్కారాలతో, కార్యక్రమాలతో, ప్రచురణలతో భారతీయ సాహిత్య అభ్యున్నతికి అవిశ్రాంతంగా పాటుపడుతున్న డాక్టర్ శ్రీనివాసరావు సాహిత్య సేవా భావాన్ని డాక్టరేట్ డిగ్రీ మరింతగా పెంచుతుందని ఆశిస్తున్నారు.

సాహిత్య అకాడమీ ప్రధాన పురస్కారంతో పాటు అనువాద, బాలసాహిత్య, యువసాహితీ పురస్కారాలతోనూ, భాషా సమ్మాన్, అకాడమీ ఫెలోషిప్ వంటి ప్రత్యేక పురస్కారాలను కూడా ప్రదానం చేస్తూ భాషా సాహిత్యవేత్తలను ప్రోత్సహిస్తూ 24 ప్రధాన భాషలతో పాటు పలు ప్రాంతాల గిరిజన భాషల అభ్యున్నతికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి హోదాలో డాక్టర్ శ్రీనివాసరావు చేసిన సేవలు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement