కోల్ కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో తుదితీర్పు
జీవిత ఖైదులో పాటు రూ.50వేలు జరిమానా
అరుదైన కేసు అంటూ సిబిఐ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి
17 లక్షలు బాధితురాలికి నష్టపరిహారం
ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశం
120 మంది సాక్షులను విచారించిన కోర్టు
162 రోజులలోనే తుది తీర్పు వెలువరించిన సిల్దా కోర్టు
తీర్పుపై బాధిత కుంటుబీకులు ఆగ్రహం
నష్టపరిహారం వద్దు.. ఉరి శిక్ష వేయాలంటూ నినాదాలు
కోల్ కోతా : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించింది పశ్చిమ బెంగాల్ లోని సిల్దా కోర్టు. జీవిత ఖైదు విధించడంతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరణించేంతవరకూ సంజయ్ జైలులోనే ఉండాలని తన తీర్పు స్పష్టంగా పేర్కొంది. అలాగే భాదితురాలు కుటుంబానికి రూ.17 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలంటూ న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.. ఈ కేసులో కోర్టు మొత్తం 120 మంది సాక్షులను విచారించింది.. 162 రోజులలోనే మొత్తం విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వడం విశేషం.
కాగా నేటి ఉదయం శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి జడ్జి సంజయ్ రాయ్ కిఅవకాశం కల్పించారు. తాను ఏ నేరం చేయలేదని ఈ సందర్భంగా సంజయ్ కోర్టుకు వెల్లడించాడు .
“నేను ఈ నేరం చేయలేదు. ఏ కారణం లేకుండానే నన్ను ఇందులో ఇరికించారు. నన్ను దోషిగా నిలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు ధ్వంసమయ్యాయని నేను విన్నాను. నన్ను ఇరికించారో, లేదో దానిని బట్టి మీరే నిర్ణయించుకోండి. నాతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారు. నేను అమాయకుడిని. నేను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తాను. నేను నేరం చేసి ఉంటే.. అవి ఘటనాస్థలంలోనే ఊడిపోయి ఉండేవి. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మీరు ఇవన్నీ చూశారు” అని అన్నాడు.
అతడి వాదనపై జడ్జి స్పందిస్తూ.. “నాతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజు సమయం
ఇచ్చాను. మూడు గంటలు మీ మాటలు విన్నాను. నా ముందు అభియోగాలు, సాక్ష్యాలు, దస్త్రాలు అన్నీ ఉన్నాయి. వాటిని పరిశీలించాను. వాటి ఆధారంగా మిమ్మల్ని దోషిగా తేల్చాను. మీరు ఇప్పటికే దోషి. ఇప్పుడు శిక్ష గురించి మీ ఆలోచన ఏంటని మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబంలో మీతో ఎవరైనా సన్నిహితంగా ఉంటారా..?” అని అడిగారు. దానికి సంజయ్ బదులిస్తూ.. “లేదు సర్. నేను జైల్లో ఉన్నాను. నా దగ్గరకు ఎవరూ రాలేదు” అని చెప్పాడు. ఈసందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ..”ఇది చాలా అరుదైన కేసు. మరణించిన ఆ విద్యార్థిని ఎంతో ప్రతిభావంతురాలు. ఈ ఘటన సమాజాన్ని ఎంతగానో కలచివేసింది. ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కోల్పోయారు. వైద్యులకే రక్షణ లేకపోతే.. ఇంకేం చేయాలి. మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదు” అని వాదించారు.
సిబిఐ వాదనలు విన్న కోర్టు ఇది అరుదైన కేసు కాదని పేర్కొంది.. దీంతో అతడికి జీవిత ఖైదు విధిస్తునట్లు వెల్లడించింది.
ఇది ఇలా ఉంటే గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘట తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమబెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి, విచారించింది. దీనిలోభాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు
సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయన్న ఆగస్టు 10న కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు జైలులోనే ఉన్నాడు.
తీర్పుపై బాధిత కుటుంబీకులు ఆగ్రహం
ఈ కేసులో దోషికి జీవిత ఖైదు విధించడం పట్ల బాధిత కుటుంబీకులు ఆగ్రహం వక్తం చేశారు.. తమకు ఎటువంటి నష్ట పరిహారం అవసరం లేదని, దోషికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నామని కోర్టులోనే నినాదాలు చేశారు.. తమకు కింద కోర్టులో న్యాయం జరగలేదని, పై కోర్టుకు వెళతామని పేర్కొన్నారు..