Friday, November 22, 2024

ఓ మైగాడ్‌.. పావురాల వ్య‌ర్థాల‌తో ఎంత అన‌ర్థ‌మో తెలుసా!

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: వేల సంవత్సరాల నుంచి భారతీయ సమాజంలో పావురాలకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలం పోస్ట్‌ మెన్‌లుగా, శాంతికి చిహ్నంగా విభిన్నమైన పాత్రలను పావురాలు పోషించాయి. కాలక్రమంలో భౌగోళికంగా వస్తున్న మార్పుల వల్ల కొన్ని జీవరాశులు అంతరించి పోతుంటే మరికొన్ని జీవరాశులు ప్రకృతి వైఫరిత్యాలను సైతం తట్టుకుని తమ సంతతిని పెంచుకుంటున్నాయి. అలాంటి కోవకు చెందినవే పావురాలు. హైదరాబాద్‌ నగరంలో ఇవి నానాటికి పెరిగి పోతున్నాయి. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో దాదాపు 10లక్షల వరకు పావురాలున్నాయి. రహదారులు, చారిత్రక ప్రదేశాలు, అపార్ట్‌మెంట్లు, పార్క్‌లు తదితర ప్రాంతాల్లో 500కు పైగా దాణా కేంద్రాలు వెలిశాయం టేనే నగరంలో వాటి ఉనికి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2017లో గ్రేటర్‌ పరిధిలోని పార్క్‌ల్లో పావురాల విడిది కేంద్రాల ఏర్పాటు, దాణా వేయడాన్ని జీహెచ్‌ఎంసీ నిషేధించినప్పటికి పబ్లిక్‌ ప్లేస్‌ల్లో మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. దాణా వేస్తుండటం వల్లే పావురాల సంఖ్య విపరీతంగా పెరిగి, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు అనేక సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు వాటి నిరోధానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ గాని ప్రభుత్వం గాని ఎలాంటి ప్రణాళికలు చేపట్టలేదు. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న కోతుల సంతతిని తగ్గించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో రిహబిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి, వాటి కట్టిడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు హైదరాబాద్‌లో పావురాల సంతతి వృద్ధి కాకుండా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

వ్యర్థాల ద్వారా శ్వాసకోశ వ్యాధులు.?

పావురాల ద్వారా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. వీటి రెక్కలు, వ్యర్థాల వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని కొంతమంది వైద్యులు సైతం అంటున్నారు. వీటి వల్ల చర్మం, నోరు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, ఉదరకోశం దెబ్బతినే ప్రమాదం ఉన్నాయని తెలుస్తోంది. అయితే పావురాలతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఏ రాష్ట్ర ప్ర భుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని వెల్లడించలేదు. నగరంలో విపరీతంగా పెరిగి పోతున్న పావురాల సంతతిని కట్టడి చేయాలనే డిమాండ్‌ గత కొన్నేండ్లుగా వినిపిస్తోంది. ఈ విషయమై శాస్త్రీయ పరిశోధన జరిపి, ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని నగరవాసులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement