Tuesday, November 26, 2024

Delhi | రాజకీయం నాతో చేయండి, పిల్లలతో కాదు.. నా కొడుకు తప్పు చేస్తే నేనే తీసుకొచ్చి అప్పగిస్తా: బండి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజకీయాలు తనతో చేయలేక తన కొడుకుపై కేసులు పెట్టి రాజకీయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కాలేజీలో తోటి విద్యార్థిపై దాడికి పాల్పడ్డారంటూ బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై కేసు నమోదు చేయడంపై మంగళవారం రాత్రి గం. 9.30 సమయంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీజేపీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షులు డా. మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, వెదిరె శ్రీరాంతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు భగీరథ్ చేయి చేసుకున్నాడని, ఈ విషయాన్ని దాడికి గురైన విద్యార్థే స్వయంగా ఒప్పుకున్నాడని తెలిపారు.

ఇప్పుడు ముగ్గురి జీవితాలు నాశనం చేయడం కోసం ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సరే ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు నాన్-బెయిలబుల్ కేసులు పెట్టారని అన్నారు. ఒకప్పుడు కేసీఆర్ మనవడి గురించి తప్పుగా మాట్లాడితే తానే ఖండించానని, రాజకీయాలతో సంబంధం లేని చిన్నపిల్లలను వివాదాల్లోకి లాగొద్దన్న ఇంగితం తనకుందని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ తనతో రాజకీయం చేయాలని, పిల్లలతో కాదని అన్నారు. చదువుకునే పిల్లలు కొట్టుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతుంటారని, ఇందులో కేసీఆర్‌కు వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగితే ముందు విద్యార్థి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేయాలని, అదేదీ చేయకుండా నేరుగా క్రిమినల్ కేసులు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసని అన్నారు.

తన కొడుకుని తానే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తానని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.. లేక లాఠీలతో కొడతారా..? ఏం చేస్తారో చూస్తాం అంటూ వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దన్న ఇంగిత జ్ఞానం కేసీఆర్‌కు లేదని, తాను తలచుకుంటే కేసీఆర్ మనువడు చేసినవన్నీ బయటపెట్టగలనని అన్నారు. తాను చేస్తున్నది కరెక్టేనా అని కేసీఆర్ తన భార్యనో, కోడలినో అడిగితే చెబుతారని బండి సంజయ్ హితవు పలికారు. దెబ్బలు తిన్న విద్యార్థి ఫిర్యాదు చేశాడా లేక, వేధింపులకు గురైన విద్యార్థిని ఫిర్యాదు చేసిందా అంటూ సంజయ్ ప్రశ్నించారు.

- Advertisement -

దేవుళ్లతో వ్యాపారం చేస్తున్న నీచులు
యాదాద్రిపై మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. యాదాద్రిపై రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి లాభం గడిస్తున్నామని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటు అన్నారు. నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ హిందూ దేవుళ్లను కించపరుస్తుంటే నోరెందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. ఆలయాలను, దేవుళ్లను కూడా వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పేరుతో ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కబ్జా చేసి భూముల రేట్లు పెరిగేలా చేశారని దుయ్యబట్టారు. ధర్మం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ధార్మిక క్షేత్రాలను వ్యాపారం కోసం అభివృద్ధి చేస్తున్నట్లు నమ్మిస్తే ఆ దేవుడు కూడా క్షమించడని సంజయ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు నిజాం వారసుడి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించడాన్ని బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ సమాజాన్ని రాచి రంపాన పెట్టి, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ నిజాం నవాబు వారసుడు ఎక్కడో టర్కీలో చనిపోతే ఆయన మృతదేహాన్ని ఇక్కడికి రప్పించి అంత్యక్రియలు చేయిస్తాననడం సిగ్గు చేటు అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శించి ఎంతో మందిని చంపిన నిజాంపై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. నిజాం ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని, అందుకే వాళ్లను పొగుడుతున్నారని ఆరోపించారు. నయీం డైరీ ఆస్తుల కేసు ఎటు పోయిందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. నయీం కబ్జా చేసుకున్న ఆస్తులన్నీ కేసీఆర్ కుటుంబం కబ్జా చేసుకుందని ఆరోపించారు. నయీం డైరీ రహస్యాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement