Saturday, November 23, 2024

దేశవ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించండి.. కేంద్రానికి దక్షిణాది చెరుకు రైతులు, ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ,  ఆంధ్రప్రభ దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావుతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నామా నాగేశ్వరరావు నేతృత్వంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సుమలత అంబరీష్, ఎల్ హన్మంతయ్య, శాంతా కుమారి, ఎ. గణేశమూర్తి,పి. స్వస్తి సుందరం చియాతో పాటు చెరకు రైతు సంఘాల నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు ఎంపీ నామా నాగేశ్వరరావు నాయకత్వంలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను  కలిసి చెరకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. చెరకు రేటు విషయంలో దక్షిణాది రాష్ట్రాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, చెరకు రికవరీ రేటు 10.25కి పెంచడం వల్ల దిగుబడి తగ్గి, తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్రమంత్రికి వివరించారు.

గతంలో మాదిరిగానే రికవరీ రేటును 8.5కి తగ్గించాలని కోరారు. దిగుబడి తక్కువగా ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు రూ.525 కోట్ల మేర నష్టపోతున్నారని వివరించారు. రికవరీ పద్ధతిలో కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి టన్నుకు ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. ప్రస్తుత సంవత్సరంలో క్వింటాకు రూ.305 గా నిర్ణయించిన ఎఫ్ఆర్పీ ధరను సమీక్షించి రూ.350కి పెంచాలని ఎంపీలు, రైతుల బృందం విజ్ఞప్తి చేసింది. చెరకు కోత, పెరిగిన రవాణా ఖర్చు, ఎరువుల ధర ఎఫ్‌ఆర్పీ పెంపునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరకు కోత, రవాణా 15- 16 నెలలు కావడం వల్ల రైతులు రుణాలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోందని కేంద్రమంత్రికి తెలిపారు. 12 నెలల తర్వాత అలస్య కాలానికి 15 శాతం వడ్డీని కలిపి, ఉత్తర్వులు ఇవ్వాలని లేదా చెరకు రుణ వాయిదా చెల్లింపుల్లో జాప్యం కారణంగా చెరకు పంట రుణానికి 20 నెలల చెల్లింపు వ్యవధిని ఏర్పాటు చేయాలని అన్నారు.

- Advertisement -

సిబిల్ స్కోర్ ప్రకారం రైతులకు రుణం అందనందున వ్యవసాయ రుణాలు ఇచ్చేటప్పుడు సిబిల్ స్కోర్ ప్రమాణాలను తొలగించాలని కేంద్ర మంత్రిని కోరారు. గతేడాది చెరకు దిగుబడి  ఎఫ్ఆర్పీ రేటు ప్రమాణాల ఆధారంగా ప్రస్తుత సంవత్సరం చెరకు సరఫరా చేసిన రైతులకు ఎఫ్‌ఆర్పీ రేటును లెక్కించి, రేటు చెల్లించడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. షుగర్ కంట్రోల్ చట్టాన్ని సవరించాలని ఎంపీలు బృందం కోరింది. భారీ వర్షాలు, వాన చినుకులు, వరదల వల్ల చెరకు దెబ్బతింటుందని, వంటల బీమా పథకాన్ని అమలు చేసి, రైతులను ఆదుకోవాలని ఎంపీల బృందం తోమర్‌ను కోరినట్టు ఎంపీ నామా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వథకాలు అమలు చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి పెద్దఎత్తున ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సరఫరా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ సీఎ కేసీఆర్ దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని దిక్చూచిగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులతో పాటు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.కె. దైవ శిగామని తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వారంతా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి భగవంత్ కుమార్ కుభాను కూడా కలిసి చెరకు రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్టరీ యజమానులు డబ్బులు చెల్లింపులో జరిగే జాప్యాన్ని నివారించాలని, తూనికలలో జరిగే మోసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం లేదా ఇతర వాతావరణ నష్టాలకు పరిహారం, ఇన్సూరెన్స్ కల్పించి ఆదుకోవాలన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement