రష్యా దండయాత్రను నిలువరించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచదేశాల జోక్యాన్ని అభ్యర్థించిన ఆయన, తాజాగా రష్యన్ సైనికుల తల్లులకు కీలక సందేశం ఇచ్చారు. తమ బిడ్డల్ని యుద్ధానికి పంపించకుండా నిలువిరంచాలని వేడుకున్నారు. ”రష్యన్ తల్లులకు మరోసారి విన్నవిస్తున్నా.. మీ కుమారులను విదేశీ గడ్డపైకి యుద్ధానికి పంపకండి. మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో పరిశీలించుకోండి. మీ ప్రభుత్వం వారిని విన్యాసాలు చేయడానికో.. మరో ప్రాంతానికో పంపించామంటే నమ్మకండి. మీ కుమారుడిని ఉక్రెయిన్లో యుద్ధం చేయడానికి పంపించినట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అడ్డుకోండి” అని ఓ వీడియోలో అభ్యర్థించారు. . మరోవైపు బందీలుగా ఉన్న రష్యన్ సైనికులను వచ్చి విడిపించుకెళ్లాలని ఇటీవల ఉక్రెయిన్ ప్రభుత్వం వారి తల్లులకు సూచించింది.
ఇందుకోసం ఉక్రెయిన్ రక్షణ శాఖ ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి భయానక యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎన్నడూ కోరుకోలేదని జెలెన్స్కీ ఈ సందర్భంగా చెప్పారు. అయితే తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామన్నారు. ఇప్పటి వరకు 12వేల మంది రష్యన్ సైనికులను హతమార్చామని, అనేక మందిని నిర్బంధించామని చెప్పారు. అయితే రష్యా మాత్రం సైనికుల మరణాలపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. తమవైపున 498 మంది జవాన్లు మరణించినట్లు యుద్ధం ప్రారంభమైన తొలి వారంలో చెప్పింది. ఆ తర్వాత నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే కొందరు సైనికులు ఉక్రెయిన్లో బందీలుగా ఉన్నారని మాత్రం అధికారికంగా ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..