హైదరాబాద్, ఆంధ్రప్రభ: వానాకాలం సాగు సీజన్‌పై సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ దిశగా వానాకాలపు పంటల సాగు లక్ష్యాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ ప్రణాళికకు అనువుగా జిల్లాల వారీగా సాగు కార్యాచరణ మొదలైంది. వివిధ రకాల పంటల సాగు, విస్తీర్ణం, విత్తనాలు తదితర ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జిల్లా స్థాయి నుంచి వచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, మందుల వినియోగం, అవసరాలను గుర్తించనుంది. ప్రత్యామ్నాయ పంటల విధానంలో భాగంగా పత్తి సాగును ఈ ఏడాది పెంచేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. పత్తి సాగును 70లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించేలా, వరిసాగును 45 లక్షల ఎకరాలకు పరిమితం చేసేలా ప్రభుత్వం యోచిస్తోంది.
అందుకే ప్రత్యామ్నాయ పంటల దిశగా…
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ రైతు వ్యతిరేక విధానాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో వరి సాగును నియంత్రించాలని భావిస్తోంది. మిగతా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి ఈ దిశగా రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 42లక్షల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగయ్యేలా సర్కార్ ప్రణాళికలు వేసుకుంది. ఈ దఫా ప్రధానంగా పత్తి సాగుకే 75లక్షల ఎకరాలను టార్గెట్‌గా నిర్దేశించుకున్నది. ఇప్పటికే ఎకరాకు రెండు ప్యాకెట్ల చొప్పున కోటి 50లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని గుర్తించింది. వీటిని సమీకరించి సిద్ధంగా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. అదనంగా మరో 20లక్షల ప్యాకెట్లను కూడా సేకరిస్తోంది. బీటీ పత్తి విత్తనాల్లో భాగంగా దేశమంతటా 5.80కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు ఉత్పత్తి అవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనే 2.21 కోట్ల విత్తన ప్యాకెట్లు ఉత్పాదనకు అవకాశం ఉందని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు విత్తన ఉత్పత్తి తయారీదారులతో చర్చలు సాగించింది. విత్తన సేకరణ ప్రయత్నాలను సఫలం చేసుకొంది.
50లక్షల ఎకరాల్లోపే వరిపంట…
మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఎక్కువగా సాగు కానుందనే అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా కార్యాచరణను మొదలు పెట్టింది. 50లక్షల ఎకరాల్లో వరిపంట సాగును అంచనా వేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఎంటీయూ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, వరంగల్, జగిత్యాల రకాలకు చెందిన వరి వంగడాలను సిద్ధం చేస్తోంది. వరి విత్తనాలను 25కిలోలకు ఒక ప్యాకెట్ చొప్పున రెడీ చేస్తున్నారు. అదేవిధంగా మరో ప్రత్యామ్నాయ పంటగా పేరున్న కందికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. 15లక్షల ఎకరాల్లో కంది పంట సాగును ప్రోత్సహిస్తోంది.
సేంద్రీయ ఎరువులనూ ప్రోత్సహించేలా…
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నది,. జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను సబ్సిడీతో రైతులకు అందిస్తోంది. ఈ సీజన్‌లో 2లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్టె ఎరువును పంపిణీ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది.
పత్తికి భారీ డిమాండ్
గత సీజన్‌లో పత్తిసాగు రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపర్చింది. పత్తి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఎక్కువగా రాకపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులపాలయ్యారు. ఎకరాకు సగటున 10క్వింటాళ్లు రావాల్సిన పత్తి గడచిన సీజన్‌లో కొన్నిచోట్ల 5 క్వింటాళ్లు కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. 2021-22 వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 36 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయినట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది. అయితే వర్షాకాలంలో విపరీత వానలు, నేలలు జాలువారడం, పంటలు నీటమునక, గులాబీ పురుగు ప్రభావంతో పత్తి దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో డిమాండ్ పెరిగి ధర పెరిగింది. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.6025 ఉండగా, గరిష్టంగా క్వింటాలుకు రూ.12 వేల ధర పలికింది. 28లక్షల బేళ్ల పత్తిని రాష్ట్రంలోని జిన్నింగ్, ప్రెసింగ్ మిల్లర్లు కొనుగోలు చేయగా, 8లక్షల బేళ్ల పత్తి మహారాష్ట్ర, గుజరాత్, ఏపీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రమేయం లేకుండానే అమ్మకాలు పూర్తయ్యాయి. ఈ కారణంగా మరోసారి కూడా పత్తి పంటకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయంగా పత్తికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో పత్తి సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 70లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..