హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు ఉపయోగించే విధంగా నగర వాసులను చైతన్యపర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, పర్యావరణ హానికారక కెమికల్స్‌లను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పీవోపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని సీఎస్ వివరించారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్యపర్చాలని ఆయన సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీదార్లను ప్రోత్సహించడంతోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్‌కు తగు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎస్ సూచించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ నెలలో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం బీఆర్కే భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, మునిసిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి నీతూ ప్రసాద్‌లు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..