Friday, November 22, 2024

మీకు మీరే ప్ర‌క‌టించోవ‌ద్దు.. అభ్యర్థులెవరినీ బీజేపీ ప్రకటించలే: బండి సంజ‌య్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అధికార టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వెళ్తున్న బీజేపీలో అప్పుడే అభ్యర్థుల ఎంపిక పూర్తయిందన్న ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలలో నేతలు ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో తానే పార్టీ అభ్యర్థినని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో టికెట్‌ను ఆశిస్తున్న మిగతా నేతలు బిత్తరపోవాల్సి వస్తోంది. వాస్తవానికి బీజేపీలో ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఎక్కడా కూడా ఎన్నికలకు ఏడాదిన్నర కాలం ముందు నుంచే అభ్యర్థులు ఎవరనేది ఖరారు చేయడం సాధ్యం కాదు.

కానీ విచిత్రంగా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలలో నేతలు తామే అభ్యర్థులమని ప్రజల్లోకి వెళ్తుండటంం విచిత్రంగా ఉంది. నియోజకవర్గాలలోని నేతల తీరుపై పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. తమను సంప్రదించకుండా నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేయడం ఏమిటంటూ నిత్యం ఏదో ఒక నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నేతలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. పని చేయండి చివరి నిమిషంలో ఎవరి సత్తా ఏమిటి, ప్రజల్లో ఎవరికి ఏ మేర బలముందన్నది బేరీజు వేసి టికెట్లను ఖరారు చేస్తామని రాష్ట్ర నాయకత్వం పదే పదే చెబుతున్నప్పటికీ అభ్యర్థులం మేమే అంటూ ప్రచారం చేసుకోవడం ఏమిటని రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా ఉంది. ఇదే విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించగా, బీజేపీలో ఎన్నికలకు ముందే టికెట్లు ప్రకటించే సంస్కృతి లేదని తేల్చి చెప్పారు. కొంతమంది తమకే టికెట్‌ అంటూ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారన్న విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, అలా ప్రచారం చేసుకునే వారి పేర్లను కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోమని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీ కూడా ఇటీవల ఇదే అంశాన్ని స్పష్టం చేశారన్నారు.

భారీగా చేరికలుంటాయి…

త్వరలో బీజేపీలో చేరికలు పెద్దఎత్తున ఉంటాయని సంజయ్‌ చెప్పారు. పార్టీలో చేరుతామని చాలామంది వస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో చేరికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇకపై చేరికలన్నీ హైదరాబాద్‌లోనే ఉంటాయన్నారు. మాజీ ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రులను మాత్రమే ఢిల్లికి తీసుకెళ్తామన్నారు. పెద్దపల్లి నాయకుడు గొట్టిముక్కల సురేష్‌రెడ్డిని కూడా త్వరలోనే చేర్చుకుంటామన్నారు. పెద్దపల్లి జిల్లా నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే కాషాయ కండువాను కప్పుకుంటారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement