న్యూఢిల్లీ : డిజిటల్ కరెన్సీపై భారత నియంత్రణ నేపథ్యంలో చర్చనీయాంశంగా క్రిప్టో కరెన్సీపై సర్వేలో ఆసక్తి రేకెత్తించే పలు అంశాలు వెల్లడయ్యాయి. క్రిప్టో కరెన్సీపై నమ్మకంలేదని భారత్ లో అత్యధిక మంది అభిప్రాయపడ్డారు. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయకూడదని, విదేశాల్లో కలిగివున్న డిజిటల్ అసెట్స్ మాదిరిగా పరిగణించి పన్నులు విధించాలని కోరుతున్నారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
15 రోజుల్లో దేశంలోని 342 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించగా 29,352 మంది భాగస్వాములు పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 71 శాతం మంది క్రిప్టో కరెన్సీలపై స్వల్పంగా లేదా అస్సలు నమ్మకం లేదని చెప్పారు. ఆర్బీఐ నియంత్రణలో భారత్ సొంతంగా రూపొందించబోతున్న క్రిప్టో కరెన్సీకి సర్వే భాగస్వాముల్లో 51 శాతం మంది మద్దతు తెలిపారు. 26 శాతం మంది వ్యతిరేకించారు. క్రిప్టో కరెన్సీల ప్రకటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కేవలం 5 శాతం మంది మాత్రమే క్రిప్టో ప్లాట్ ఫామ్స్ ప్రకటనలు కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ ప్రకటనలు ప్రభావం చూపుతున్నాయని, అంతగా ప్రభావం చూపడంలేదని గణనీయ సంఖ్యలో భాగస్వాములు అభిప్రాయపడ్డారు. కాగా క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 ఈ శీతాకాల పార్లమెంట్ సెషన్ లో పార్లమెంట్ ముందుకురానుంది. భారత్ లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను ఈ బిల్లు నిషేధించనుంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..