ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని… ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి అంశాలను కనీస ధర్మంగా పాటించడం ద్వారా మన కుటుంబాన్నే కాక సమాజాన్నీ మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమని ఆయన సూచించారు. 15-18 ఏళ్ల వారు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం రిజిష్టర్ చేసుకుని వీలైనంత త్వరగా టీకాలు వేసుకోవాలని ఉపరాష్ట్రపతి చెప్పారు. టీకాల విషయంలో సందేహాలున్న వారిని చైతన్యపరిచేలా పౌర సమాజం, ప్రజాసంఘాలు, వైద్య నిపుణులు, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే ఈ వైరస్‌పై పోరాటంలో దేశం చేస్తున్న ప్రయత్నాన్ని మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లగలమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 15వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ఉపరాష్ట్రపతి సందేశమిచ్చారు. భారతీయ సంతతి వైద్యులు ప్రపంచం నలుమూలల ఎక్కడకు వెళ్లినా తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ఆధారిత సంస్థలు, భారతదేశ సంస్థలు పరస్పర సమన్వయంతో ఇటీవల కొర్బేవాక్స్, కోవోవాక్స్ టీకాలను రూపొందించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. భారత్-అమెరికా సంస్థలు ఇలాగే సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో గ్రామీణ, పట్టణ/నగర ప్రాంతాల మధ్య ఉన్న వైద్యసేవల అంతరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ సరైన వైద్యసేవలు అందించేందుకు కృషి జరగాలని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో వైద్య-సాంకేతిక సంస్థలు స్టార్టప్ ల ద్వారా తమ సేవలను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో నమోదు చేసుకోవడం ద్వారా వ్యాధిగ్రస్తుల సంపూర్ణ వివరాలు ఒకేచోట అందుబాటులోకి వస్తాయని, అప్పుడు సరైన వైద్యం అందించేందుకు వీలవుతుందని వెంకయ్య తెలిపారు. తాజా నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ సాధించిన ప్రగతిపై ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ప్రతి ఏడాది ప్రగతిని సాధిస్తూ టాప్-3లో చోటు దక్కించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల దత్తత, ఇతర కార్యక్రమాల ద్వారా కరోనా సెకండ్ వేవ్ సమయంలో చేసిన సేవలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital