Saturday, November 23, 2024

ఒమిక్రాన్‌తో భ‌యం వ‌ద్దు.. క‌ర్నాట‌క‌లో కోలుకున్న డాక్ట‌ర్‌..

ఒమిక్రాన్ భ‌యంతో జ‌నం భ‌య‌ప‌డుతున్న‌ వేళ బెంగ‌ళూరులోని బౌరింగ్‌ అండ్‌ లేడీ కర్జన్‌ ఆస్పత్రి వర్గాలు ఊరట కలిగించే న్యూస్‌ చెప్పాయి. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బారినపడ్డ బెంగ‌ళూరు డాక్టర్‌ (46) కోలుకున్నారని, ఆయనకు ఎటువంటి సమస్యలు లేవని అక్క‌డి డాక్ట‌ర్లు వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్టులు అయిన ఆయన భార్య, కూతురు, మరో డాక్టర్‌ కూడా కోలుకుంటున్న‌ట్టు తెలిపారు. ఒమిక్రాన్‌ కూడా కొవిడ్‌-19 లాంటిదేనని, దాని గురించి భయపడాల్సింది లేదని బాధితులకు చికిత్స అందించిన బౌరింగ్‌ అండ్‌ లేడీ కర్జన్‌ ఆస్పత్రి సీనియర్‌ డాక్టర్‌ ఒకరు ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో చెప్పారు. కొవిడ్‌ 19కు అందించిన చికిత్సనే వీరికి కూడా అందించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

మోనోక్లోనల్‌ యాంటి బాడీస్‌తో చికిత్స చేసిన తర్వాత ఒమిక్రాన్‌ బాధితుడు కోలుకున్నారని ఆ డాక్ట‌ర్ తెలిపారు. ఆందోళనకు గురికాకుండా కొవిడ్‌-19 ప్రోటోకాల్స్‌ పాటిస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ సోకిన డాక్టర్‌కు ఒళ్లు నొప్పులు, చలి, తేలికపాటి జ్వరం లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు. బాధితుడికి శ్వాస, రక్త సంబంధమైన ఇబ్బందులు ఏవీ తలెత్తలేదని అన్నారు. కాగా, దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. తొలుత క‌ర్నాట‌క‌లో రెండు, ఆ తర్వాత గుజరాత్‌లో ఒకటి, ముంబైలో మరొకటి.. ఈ రోజు ఢిల్లీలో మ‌రొక‌రికి ఒమిక్రాన్ సోకిన‌ట్టు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement