న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీకి దీపావళి శోభ వచ్చేసింది. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీలో శనివారం ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి మేళాలో భాగంగా ఐటీవోలోని డా. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ స్మారక ఉన్నత పాఠశాలలో దీపావళి మేళా జరిగింది. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు డా. ఎమ్.ఆర్. మూర్తి, ఉపాధ్యక్షులు ఎస్.ఎ అలీషా, సెక్రటరీ ఎస్. ఈశ్వర్ ప్రసాద్, ట్రెజరర్ ఛటర్జీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు సందర్శించారు. స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైడ్స్ కోలంబస్, మిక్కీమౌస్, ట్రప్లిన్, ట్రైన్, గన్ బెలూన్లతో పిల్లా పెద్దా ఆనందోత్సాహాలతో గడిపారు.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
లక్కీడిప్‌లో పాల్గొన్న విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. దీపావళి వేడుకుల్లో ఆంధ్రా విద్యా సంఘం యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆంధ్రా స్కూల్ ఆర్కే పురం బ్రాంచ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన పూజారులు వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.