బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారికి మేలుకొలుపు
దివ్య హారతి అనంతరం భక్తులకు దర్శనం
బాలరాముని దర్శనం కోసం 20లక్షల మంది వెయిటింగ్
రాత్రి 11గంటల వరకు నిరంతరాయంగా దర్శనం
సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకం
అపురూప ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తులు
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం 3.30 గంటలకు బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారిని మేల్కొలిపారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామివారిని మేల్కొలిపారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
సూర్యకిరణంతో నుదుటి తిలకం..
అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. ఇవాళ నవమి సందర్భంగా రాత్రి 11గంటల వరకూ రామ్‌లల్లా దర్శనాలు కొనసాగనున్నాయి. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12.16 గంటలకు సూర్య కిరణాలతో బాలరాముడి నుదుటన తిలకం దిద్దారు.. ఈ అపూర్వ ఘట్టం నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు సాగింది. బాలరాముడి నుదుటిన సూర్యకిరణం వాలిన ఈ ఘట్టాన్ని వేలాది మంది భక్తులు ప్రత్యక్ష్యంగా తిలకించి పులకించి పోయారు..
సూర్య తిలకం వెనుక అద్భుత సైన్స్…
శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు అతని నుదుటిపై దేదీప్యమానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. మూడవ అంతస్తులో అమర్చిన మొదటి అద్దంపై సూర్యకిరణం ప్రసరిస్తుంది. అక్కడ ఆ కిరణం ఇత్తడి పైపులోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత ఇది ఇత్తడి పైపులో అమర్చిన రెండవ అద్దాన్ని తాకుతుంది. 90 డిగ్రీల వద్ద మళ్లీ ప్రతిబింబిస్తుంది. దీని తరువాత ఇత్తడి పైపు గుండా వెళుతున్నప్పుడు, ఈ కిరణం మూడు వేర్వేరు లెన్స్‌ల గుండా ప్రవహించి, పొడవైన పైపు గర్భగుడి చివర అమర్చిన అద్దాన్ని తాకుతుంది. అ అద్దం నుంచి నేరుగా బాలరాముని నుదుటిని తాకుతుంది..