హైదరాబాద్, ఆంధ్రప్రభ: బాసర ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులకు కళ్లద్దాలు ఉచితంగా అందజేయనున్నారు. దాదాపు 1200లకు పైగా విద్యార్థులకు వీటిని ఇవ్వనున్నారు. ట్రిపుల్ ఐటీలో 9వేల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1200 మంది విద్యార్థులు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్లుగా అధికారులు గుర్తించి ఇటీవల పరీక్షలు జరిపించారు. ఈనేపథ్యంలో వీరికి కళ్లద్దాలను పంపిణీ చేయనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో వర్సిటీ అధికారులు కళ్లద్దాలు పంపిణీ చేసే అంశంపై ఇటీవలే చర్చించారు. విద్యార్థులకు కళ్లద్దాలు ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు అంగీకరించారు. దాంతో ఐదారు రోజుల్లో విద్యార్థులందరికీ ఉచితంగా కళ్లద్దాలను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సమస్యలపై దృష్టి…
పెండింగ్ స్కాలర్‌షిప్స్‌ను మంజూరుచేయడంపై వర్సిటీ అధికారులు దృష్టిసారించారు. ఇటీవలే రూ.40 లక్షలు మంజూరు కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేయించేందుకు అధికారులు దృష్టిసారించారు. సుమారు నాలుగైదు కోట్ల స్కాలర్‌షిప్స్ రావాల్సి ఉన్నట్లు తెలిసింది. అలాగే వర్సిటీలోని నాన్‌టీచింగ్ సిబ్బంది పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలలో అన్ని రకాల వసతులను కల్పించారు. దసరా సెలవుల్లో భవనాల మరమ్మతులు, రంగులు వేయడం లాంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆర్జీయుకేటీ ప్రత్యేకతలు, ఫలితాలతో కూడిన డ్యాక్యుమెంటరీని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు.