హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం సబ్సీడీపై పంపిణీ చేస్తున్న గొర్రెల కోసం ఎదురుచూస్తున్న జీవాల పెంపకందారుల నిరీక్షణకు తెరపడనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ఏప్రిల్ 14నుండి ప్రారంభించాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర జీవాల పెంపకందారుల సంక్షేమ కార్పోరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలోని 3, 61, 000 జీవాల పెంపకందారులకు లబ్ది చేకూరనుంది. రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అములపై వారం తర్వాత రాష్ట్రస్థాయిలో మంత్రి తలసాని ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశ ం అనంతరం గొర్రెల పంపిణీపై మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం గొల్ల, కురుమలకు 75శాతం స బ్సీడీపై జీవాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత గొర్రెల పంపిణీ కింద 3, 93, 000 మంది కాపరులకు గొర్రెలను పంపిణీ చేశారు.
2017లోనే రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 3, 61, 000 మంది లబ్దిదారుల ఎంపిక జరిగింది. వీరందరికీ నెల రోజుల్లోగా గొర్రెల పంపిణీ ప్రారంభం కానుంది . ఏప్రిల్ మొదటి వారంలో లబ్దిదారులు డీడీలు చెల్లించాలని చెప్పడంతోపాటు గొర్రెలను పొందేందుకు ఉండాల్సిన అర్హతలను పేర్కొంటూ ప్రకటనను రాష్ట్ర జీవాల పెంపకందారుల అభివృధ్ది కార్పోరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని యాదవ, కురుమ సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికే అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8109 గొర్రెల కాపరుల సొసైటీలు ఏర్పాటయ్యాయి. ఈ సొసైటీల్లో సభ్యత్వం ఉన్నవారికే రెండో విడతలో గొర్రెలను పంపిణీ చేయనున్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కింద 21 జీవాలను ఒక యూనిట్‌గా (20 ఆడగొర్రెలు, ఒక పొట్టేలు)లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయంతో ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పశుసంవర్థకశాఖను, జీవాల పెంపకందారుల అభివృద్ది కార్పోరేషన్‌ను ఆదేశించారు. లబ్దిదారులకు పంపిణీ చేసే ఒక్కో యూనిట్ గొర్రెల విలువ రూ.1,75,000గా ఉండగా ఇందులో 25శాతం అంటే రూ. 43,250 లను లబ్దిదారులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 1, 31, 750 రూపాయల విలువను సబ్సీడీ కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. లబ్దిదారులకు గొర్రెల యూనిట్‌తోపాటు ముందులతో కూడిన కిట్, ఏడాదిపాటు జీవాలకు, పెంపకందారులకు బీమా సదుపాయం, గొర్రెల కొనుగోలుకు అయ్యే రవాణా వ్యయాన్ని కూడా ప్రభుత్వమే సమకూర్చనుంది.