న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా “ఆయుష్ ఆప్కే ద్వార్” క్యాంపెయిన్ కింద నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ 13,22,884 ఔషధ మొక్కల జాతులకు చెందిన మొక్కలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఆంద్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మొక్కల పంపిణీ జరిగిందని చెప్పారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంగళవారం ఆయన రాతపూర్వక జవాబులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన మొక్కల పోషణ, పెంపకం కోసం ఏఏకేఎం కింద నిర్దిష్టమైన ఆర్థిక సహాయమేమీ అందించలేదని స్పష్టం చేశారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద ఔషధ మొక్కలను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. ఔషధాల మొక్కలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్టు కేంద్రమంత్రి బదులిచ్చారు.