హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇక మీదట ప్రజా పంపిణీ వ్యవస్థలోని రేషన్ షాపుల ద్వారా పోర్టిఫైడ్ బియ్యాన్ని (బలవర్దకమైన బియ్యం) ప్రజలకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో… తెలంగాణలోని రైస్ మిల్లర్లు తమ మిల్లుల్లోని యంత్రాలను పోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తికి అనుగుణంగా మారుస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను వేగంగా చేపడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అతి కొద్ది రైస్ మిల్లుల్లో మాత్రమే పోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి అనుగుణంగా మిషనరీ ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది రైస్ మిల్లర్లు వేగంగా పోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తి రైస్ మిల్లింగ్ మిషనరీని తెప్పిస్తున్నారు. చైనా నుంచి ఈ మిషనరీ తెలంగాణకు దిగుమతి అవుతోంది. పోర్టిఫైడ్ బియ్యం పంపిణీ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న రక్తహీనత, పోషకాహార లోపం తదితర అనారోగ్య సమస్యలకు చెక్‌పెట్టొచ్చని నిరూపితమైంది.
దేశంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సరఫరా చేస్తున్న ముడి, ఉప్పుడు బియ్యం స్థానంలో ఇకమీదట పోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. పోర్టిఫైడ్ బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్‌తోపాటు విటమిన్ బీ12, విటమిన్ 2, విటమిన్ ఏ, జింక్‌తోపాటు మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయని బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ్స (బీఐఎస్) ప్రకటించింది. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌షాపుల ద్వారా సాధారణ ప్రజానికానికితోడు అన్ని అంగన్ వాడీ కేంద్రాలు, ప్రధాన మంత్రి పోషన్ పథకం కింద పోర్టిఫైడ్ బియ్యాన్నే పంపిణీ చేయనున్నారు.
వాస్తవానికి గతేడాది ఏప్రిల్ నుంచి దేశంలో దశలవారీగా పోర్టిఫైడ్ బియ్యం పంపిణీని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పోర్టిపైడ్ బియ్యం ఉత్పత్తి యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలంగాణ రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఒక కేజీ పోర్టిఫైడ్ రైస్‌ను 99 కేజీల ముడి బియ్యం, లేదా ఉప్పుడు బియ్యంలో కలపాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 20 టన్నుల పోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తి సామర్థ్యం … రైస్ మిల్లుల్లో ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్ర భుత్వం కేజీ పోర్టిఫైడ్ బియ్యానికి రూ.72 ఇస్తుండగా… తమకు రూ.52 నుంచి రూ.62 మాత్రమే చెల్లిస్తున్నారని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టిఫైడ్ బియ్యం ఒక్క క్యాన్సర్ పేషెంట్లు తప్ప మిగతా ప్రజలంతా తినేందుకు అనుకూలంగా ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. గతంలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రమే పోర్టిఫైడ్ బియ్యాన్ని వండి వడ్డించేవారని, ఇప్పుడు క్రమ క్రమంగా ఈ బియ్యం వినియోగం తలంగాణలో రోజు రోజుకూ పెరిగిపోతోందని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీ. మోహన్‌రెడ్డి చెబుతున్నారు.
రేషన్ బియ్యం అమ్మకాలకు చెక్…
పోర్టిఫైడ్ బియ్యం పంపిణీతో అక్రమ రేషన్ బియ్యం అమ్మకాలకు తెరపడనుందని అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్న లబ్దిదారులు తినకుండా దళారులకు ఎంతకో కొంతకు అమ్ముకుం టున్నారు. ఈ నేపథ్యంలో పోషక విలవలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేస్తే కొంతవరకైనా ఆహారంగా తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ నుంచి మరో 6.05లక్షల పోర్టిఫైడ్ బియ్యం సేకరణ…
రేషన్ షాపుల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మరో 6.05 లక్షల మెట్రిక్ టన్నుల పోర్టిఫైడ్ పారా బాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఈ బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..