Sunday, September 8, 2024

Delhi | బీజేపీలో టికెట్ల పంచాయతీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అసమ్మతి రాగాలు, అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముందు నుంచీ పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకొచ్చి మరీ టికెట్లు కట్టబెట్టడం సరికాదని ఆశావహులు మండిపడుతున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం కోసం స్థానికేతరులను అభ్యర్థులుగా తీసుకొస్తే తాము అంగీకరించబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్న పది మంది ఆశావాహులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు.

లేఖపై సంతకాలు చేసినవారిలో మాజీ మంత్రి డా. విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు వి. జయపాల్, కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీటూరి అశోక్, దుబాసి వాసుదేవ్ తదితరులున్నారు. ఈ స్థానం నుంచి భూబకాసురులు, ఆంధ్ర ప్రాంతవాసులను పరిశీలిస్తున్నారని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినవారిని వదిలేసి బయట నుంచి ఎందుకు తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకే ఈ సీటు కేటాయించాలని వారంతా ఆ లేఖలో డిమాండ్ చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం కోసం పరిశీలిస్తున్నవారిలో డీజీ ర్యాంకులో రిటైరైన ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్‌తో పాటు యువనేత కళ్యాణ్ పేరు వినిపిస్తోంది.

వీరితో పాటు దుబాసి వాసుదేవ్ పేరును జాబితాలో చేర్చినట్టు తెలిసింది. అయితే రాష్ట్రంలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో రెండు స్థానాలను మాదిగ సామాజివర్గానికి, ఒక స్థానాన్ని మాల సామాజికవర్గానికి ఇస్తుంటారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలు స్థానానికి మాదిగ వర్గానికి చెందిన పోతుగంటి భరత్ ప్రసాద్ పేరును బీజేపీ తొలి జాబితాలోనే ప్రకటించింది. పెద్దపల్లి, వరంగల్ స్థానాలు పెండింగులో ఉండగా.. మాల సామాజికవర్గానికి చెందిన దుబాసి వాసుదేవ్ వరంగల్ స్థానాన్ని తనకే కేటాయించాలని కోరుతున్నారు.

విద్యార్థి దశ నుంచే బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీపీవీ, ఆ తర్వాత బీజేవైఎంలో పనిచేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పర్కాల నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. తనకు టికెట్ కేటాయించాలని కోరుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్‌ను కలిశారు. మరోవైపు మాజీ మంత్రి విజయ రామారావు సైతం వరంగల్ సీటుపై కన్నేశారు. మొత్తంగా లేఖ రాసిన 10 మంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ.. అందరూ ముక్తకంఠంతో తమలో ఎవరికిచ్చినా ఫరవాలేదు.. కానీ స్థానికులకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

బీబీ పాటిల్ వద్దు!

బీజేపీ తొలి జాబితాలో ప్రకటించిన 9 పేర్లలో జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. జాబితా ప్రకటనకు ఒక్క రోజు ముందు బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన ఆయనకు టికెట్ ఇవ్వడంపై స్థానిక బీజేపీ నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. పదేళ్లుగా ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, స్థానికులకు ఆయనెప్పుడూ అందుబాటులో లేరని వారంతా చెబుతున్నారు. పాటిల్‌కు ఇవ్వడం వల్ల గెలిచే సీటును కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం తొలుత సినీ నిర్మాత దిల్ రాజును బరిలోకి దించాలని భావించింది.

- Advertisement -

కానీ ఆయన అందుకు సుముఖంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ నేత బీబీ పాటిల్‌ను తీసుకొచ్చింది. అయితే బీజేపీలో బాగా రెడ్డి కుటుంబానికి చెందిన జైపాల్ రెడ్డితో పాటు ఆలె భాస్కర్, మహిపాల్ రెడ్డి తదితరులు ఆ స్థానం నుంచి టికెట్ ఆశించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను కాదని చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి ఎగురుకుంటూ వచ్చిన నేతలకు టికెట్ ఎలా ఇస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చాలని రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. బీబీ పాటిల్ తప్ప మరెవరికి సీటు ఇచ్చినా గెలుస్తామని, ఆయనకు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థి పార్టీ గెలిచే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. కార్యకర్తలు సోషల్ మీడియాలో తమ వ్యతిరేకతను బాహటంగానే వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement