Monday, November 25, 2024

బదిలీలపై ‘పన్ను’ల శాఖలో అసంతృప్తి.. నేడు, రేపు, కౌన్సిలింగ్‌కు అధికారుల ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: బదిలీలపై ‘పన్ను’ల శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన సమయంలో ఇచ్చిన హామీకి భిన్నంగా బదిలీల ప్రక్రియ జరుగుతోందంటూ వారు ఆరోపిస్తున్నారు. జిల్లాల్లో కనీసం కార్యాలయం కూడా లేని స్థితిలో విధుల నిర్వహణ ఏ విధంగా చేయాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బదిలీలు చేశామని చెప్పుకునేందుకే అధికారులు తాపత్రయ పడుతున్నారే తప్ప ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించడం లేదనేది ఉద్యోగుల ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో జూన్‌ 30తో ఆ ప్రక్రియను ముగించారు. వాణిజ్య పన్నుల శాఖలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బదిలీలను వాయిదా వేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఈ నెల 29న పూర్తి చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్‌ సీహెచ్‌ రాజేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ముఖ్య కమిషనర్‌ కార్యాలయంలో డెప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్లకు బదిలీల కౌన్సిలింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇదే రోజుల్లో జీఎస్టీవోలు, సీనియర్‌ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగుల కౌన్సిలింగ్‌ ప్రక్రియను నోడల్‌ స్థాయి కమిటీ చేపట్ట నుండగా, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర కేడర్‌ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను డివిజినల్‌ స్థాయి కమిటీ చేపడుతుందని ఆ ఉత్తర్వుల్లో చీఫ్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కార్యాలయం కోడ్‌ లేదు కాబట్టి జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులు చెపుతున్నారు. కొత్త కార్యాలయాలు ఏర్పాటు, జిల్లా కోడ్‌ కేటాయింపు వంటి అన్ని పనులు పూర్తి చేసేందుకు కనీసం మూడు నెలలైనా పడుతుందని ఉద్యోగులు అంటున్నారు. మరి ఆ మూడు నెలల జీతాల పరిస్థితి ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఆ హామీ ఏమైంది..
వాణిజ్య పన్నుల శాఖ పునర్‌ వ్యవస్థీకరణ, బదిలీల పారదర్శకతపై ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు దశలవారీ ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. కొత్త కార్యాలయాల ఏర్పాటు, మౌళిక సదుపాయాల కల్పన తర్వాతనే ఉద్యోగుల బదిలీలు చేపడతామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు యూనియన్‌ నేతలు ప్రకటించారు. తీరా ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతున్నట్లు ఉద్యోగులు చెపుతున్నారు. అధికారులు ఉద్యోగులకు ఇబ్బందులు లేనిరీతిలో బదిలీలు చేయాలనేది మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement