న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి జాబితా విడుదలైనప్పటి నుంచి అసంతృప్తి స్వరాలు, అసమ్మతి సెగలు రగులుకుంటున్నాయి. జహీరాబాద్, మల్కాజిగిరి స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇప్పటికే నేతలు గొంతు విప్పగా.. తాజాగా నిజామాబాద్ సిట్టింగ్ స్థానానికి మళ్లీ అభ్యర్థిగా ప్రకటించిన ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా కొందరు నేతలు దేశ రాజధాని ఢిల్లీలో గొంతు విప్పారు. అరవింద్ అహంకారంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ నిజామాబాద్‌కు చెందిన బీజేపీ నేత మీసాల శ్రీనివాసరావు ఆరోపించారు.
కాషాయం కప్పుకున్న కసాయిగా అభివర్ణించారు. నియోజకవర్గంలో ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరని, పార్టీ నేతలను, ప్రజలను చాలా చులకనగా చూస్తారని మండిపడ్డారు. పార్లమెంట్ మొత్తంలోనే ఇంత అహంకారం ఉన్న వ్యక్తి ఎవరూ లేరని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా అందరూ అరవింద్ బాధితులేనని అన్నారు. అరవింద్‌కి మళ్లీ టికెట్ ఇవ్వడం పార్టీ చేస్తున్న తప్పుగా భావిస్తున్నామని చెప్పారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి ఢిల్లీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.
వెంటనే నిజామాబాద్ స్థానానికి అభ్యర్థిని మార్చాలని జాతీయ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది కేవలం తన ఒక్కడి కోరిక కాదని, నిజామాబాద్ నియోజకవర్గంలోని 17 లక్షల మంది ఓటర్ల కోరిక ఇదేనని చెప్పారు. డేరా బాబా, నిత్యానందకు టికెట్ ఇచ్చినా ఇక్కడి వరకు వచ్చే వాళ్ళం కాదని వ్యాఖ్యానించారు. మొదటిసారి టికెట్ వచ్చినపుడు డి. శ్రీనివాస్ చక్రం తిప్పారని చెప్పిన అరవింద్, ఈసారి దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
అరవింద్‌ను మార్చాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కూడా కోరామని, అధిష్టాన నిర్ణయమే తమ నిర్ణయమని ఆయన చెప్పారని మీసాల శ్రీనివాస రావు అన్నారు. పార్టీ, ప్రజల అభిప్రాయం తీసుకుని అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అరవింద్ అభ్యర్థిగా ఉండటం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నష్ట పోకూడదన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకొచ్చానని అన్నారు.
రాష్ట్ర నాయకత్వాన్ని కలిసినా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో పార్టీ భవిష్యత్ కోసం ఢిల్లీకి వచ్చి జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ వంటి మహోన్నత వ్యక్తితో పార్లమెంటులో కలిసి కూర్చునే అర్హత అరవింద్‌కు లేదని అన్నారు. అరవింద్‌పై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయనకు వ్యతిరేకంగా నిజామాబాద్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీ గుర్తుకు జనం ఓటేస్తారని, కానీ తాము అరవింద్‌ను ఐదేళ్ల పాటు భరించలేమని అన్నారు. పార్టీ గెలవాలని కోరుకుంటానని, అరవింద్‌కు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా బీజేపీ గెలుపుకోసం పనిచేస్తానని తెలిపారు.