హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఆధార్ లింక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఢిల్లి కేంద్రంగా యూఐడీఏఐ ఆధార్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి డాక్యుమెంట్‌కు ముందు సబ్ రిజిస్ట్రార్లు తమ ఆధార్ ఆటో వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించి అమలు చేస్తోంది. గురువారంనాడు ఆధార్ అథెంటికేషన్ పనిచేయలేదు. వెరిఫికేషన్ ఫెయిల్ కావడంతో సాంకేతిక సమస్య రిజిస్ట్రేషన్ సేవలపై పడింది.
సబ్ రిజిస్ట్రార్ అథెంటికేషన్‌తో పాటు, క్రయ విక్రయదారుల ఆధార్ వెరిఫికేషన్ కూడా నిల్చిపోవడంతో పూర్తిగా 143 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల్లోని ధరణి రిజిస్ట్రేషన్లు కూడా నిల్చిపోయాయి. దీంతో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన జనం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు.
ఇండ్లు, ప్లాట్ల క్రయ విక్రయాల కోసం స్లాట్ చేసుకున్న వారంతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించారు. చలాన్లు చెల్లించి డాక్యుమెంటేషన్ సిద్ధం చేసుకున్న క్రయవిక్రయ దారులు సేవలు నిల్చిపోవడంతో సాయంత్రం వరకు వేచిచూశారు. దీంతో గురువారం స్లాట్ బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్లు శుక్రవారం పూర్తి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల నుంచి 7 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీంతో రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడింది. గతంలో ఇదే తరహాలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. మరోసారి ఇదే సమస్య తలెత్తింది.