Friday, November 22, 2024

గోదావరి జలాలపై వివాదం.. నీటి వాటాలపై స్పష్టతలేదు.. సీడబ్ల్యూసీ కి జీఆర్‌ఎంబీ లేఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:గోదావరి నీటిలభ్యతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదం ముదురుతుంది. జల లభ్యత పంపకాలపై రెండురాష్ట్రాలు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయని కేంద్ర జలసంఘానికి గోదావరి యాజమాన్యం బోర్టు లేఖరాసింది. గోదావరి నదిలో రెండురాష్ట్రాలు నీటి లభ్యతకంటే అధికంగా వినియోగించుకుంటున్నాయని జీఆర్‌ఎంబీ లేఖలో పేర్కొంది. నీటిలభ్యతపై రెండురాష్ట్రాల మధ్య అంగీకారం లేదని జీఆర్‌ఎంబీ పేర్కొనడంపట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేస్తుందనీ, . 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీడబ్ల్యూసీకి రాసిన లేఖ మేరకు గోదావరిలో 75 శాతం నీటి లభ్యతకింద 1,486,155 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ వాదిస్తోందనీ లేఖలో పేర్కొంది.

తెలంగాణలో వినియోగంలో ఉన్న,ప్రతిపాదించిన ప్రాజెక్టులకు 967 టీఎంసీలు అవసరముందనీ, మరోవైపు నదిలో 1,360 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నయనితెలంగాణ వాదిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పంపిన సీతమ్మసాగర్‌,సీతామసాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ లను పరిశీలించాలని గోదావరి బోర్డు గతవారం రోజులక్రితం సీడబ్ల్యూసీ కి లేఖ రాసింది. గోదావరి నీటిలభ్యత 1486,15 టీఎంసీలనీ దీనిని ఆధారంగా తీసుకుని తెలంగాణ నీటి వాటాను తేల్చాల్సి ఉందని లేఖలో పేర్కొంది.

అలాగే 75 శాతం నీటిలభ్యత కింద సీతారామ ఎత్తిపోతల వద్ద 347.06 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ డీపీఆర్‌ లో పేర్కొంది. అయితే సీతారామఎత్తిపోతల వల్ల దిగువన ప్రాజెక్టులపై ప్రభావాన్ని కేంద్ర జలసంఘం పరిశీలించాలని గోదావరి బోర్డు లేఖలో పేర్కొంది. అయితే తెంలగాణ నీటి లభ్యత లేకున్నా గోదావరిపై ప్రాజెక్టులను కడుతుందని ఏపీ చేసిన ఫిర్యాదును కూడా గోదావరినదీ యాజమాన్యంబోర్డు లేఖలోజతపరిచింది. ఈ నేపథ్యంలో గోదావరి జలాలపై ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉన్న వివాదాలను సీడబ్ల్యూ సీ ఏమేరకు పరిష్కరిస్తుందో వేచిచూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement