న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఎలాంటి స్తంభన లేదని స్పష్టతనిచ్చింది. విశాఖలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లో పెట్టుబడుల ప్రక్రియపై మీడియాలో వచ్చిన కథనాలను స్పష్టత ఇస్తున్నట్లు ఉక్కు శాఖ పేర్కొంది.
ఆర్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలోనే ఉందని స్పష్టం చేసింది. ఆర్‌ఐఎన్‌ఎల్ పనితీరును మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర స్పందనతో ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన వ్యాఖ్యలను ఖండించినట్టైంది.