రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు కొంత సానుకూలతో ముగిశాయి. కేంద్రం ప్రతిపాదనలపై తమ ఫోరమ్ లో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. ఈమేరకు రైతు సంఘాలతో కేంద్రం నాలుగో విడత చర్చలు జరిపింది. సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి.ఈ చర్చలో ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది.
రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు చెప్పారు. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో NCCF, NAFED వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు.
కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదన్నారు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు.