Friday, November 22, 2024

Delhi: మునుగోడు అభ్యర్థి ఎంపికపై చర్చ, గెలుపు కోసం వ్యూహాలు.. ప్రియాంకతో టీకాంగ్రెస్ నేతల భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మునుగోడు ఉపఎన్నికలకు తమ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు 10 జన్‌పథ్‌లో ప్రియాంక గాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి పలువురు సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో మాణిక్యం ఠాగోర్‌తో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, మునుగోడు ఎన్నికలపై చర్చించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విషయాల మీదా చర్చ జరిగింది.

సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడి భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందన్నారు. పార్టీలో క్రమశిక్షణపై హైకమాండ్‌తో మాట్లాడామన్నారు. పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని అధిష్టానం సూచించిందని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత, తమ పార్టీ కార్యకర్త అన్న రేవంత్, సమయాభావం వల్ల మీటింగుకి రాలేదని చెప్పుకొచ్చారు. వెంకటరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో చర్చ జరిగిందని వివరించారు. ఆయన అభిప్రాయాన్ని తీసుకుని అభ్యర్థిని ఖరారు చేస్తామని, అందరం కలిసి మునుగోడులో పని చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను ఇక నుంచి తాను నిశితంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆమె ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ప్రియాంక పాల్గొంటారని, అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదని మధు చెప్పారు. ముందుగా అభ్యర్థి ఎంపిక మీద అధిష్టానం దృష్టి పెట్టిందని వివరించారు. నేతల మధ్య చిన్నచిన్న స్పర్ధలు మినహా విభేదాల్లేవు ఆయన చెప్పుకొచ్చారు. సమావేశంలో ప్రియాంక గాంధీ నేతలతో విడివిడిగా మాట్లాడారని వెల్లడించారు. భేటీకి హాజరు కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తాను, దామోదర రాజనర్సింహ వెళ్లి మాట్లాడతామని మధుయాష్కీ అన్నారు.

సోనియాకు కోమటిరెడ్డి లేఖ
ఇదిలా ఉంటే ప్రియాంకగాంధీ నిర్వహించిన మీటింగుకి హాజరు కాకపోవడానికి గల కారణాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నమే లేఖను 10 జన్‌పథ్‌లో అందజేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. పార్టీలో తనపై ఒక వర్గం పదేపదే కుట్రలు, ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. తాను గత మూడు దశాబ్దాల నుంచి పార్టీ కోసం విధేయతతో చిత్తశుద్ధితో పని చేస్తున్నానని తెలిపారు. తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చాలా బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మీరు ఎంపిక చేసిన రేవంత్ రెడ్డికి తాను పూర్తి మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని వెంకట్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రధాన బృందం తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. తనను ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలను అగౌరవపరచడం ఒక వర్గానికి అలవాటుగా మారిందని వాపోయారు. ముప్పై ఏళ్ల నుంచి పార్టీకి నిజాయితీగా సేవలందిస్తున్న నేతలను హోంగార్డులుగా పోలుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నమ్మకమైన పార్టీ కార్యకర్తగా కొనసాగుతూ తెలంగాణ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూనే ఉన్నానని, తన ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, మాణిక్యం టాగోర్ తీరుపై సోనియాకు ఫిర్యాదు చేసిన వెంకట్ రెడ్డి, వారిద్దరి కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

కమల్ నాథ్ వంటి సీనియర్ నేతలకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు అప్పగించాలని అధినేత్రికి సూచించారు. పార్టీలో తనలా అవమానాలకు గురవుతున్న మరికొందరు నేతల గురించి కూడా వెంకట్‌రెడ్డి లేఖలో ప్రస్తావించారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నవారిని కాదని, డబ్బులతో మేనేజ్ చేసుకుంటున్నవారికి బాధ్యతలు అప్పగించడం సరికాదని వెంకట్‌రెడ్డి నొక్కి చెప్పారు. కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉన్న కారణంగా ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement