Saturday, November 23, 2024

హనుమంతుడి జన్మస్థలంపై అసంపూర్ణంగా ముగిసిన చర్చ

హనుమంతుడి జన్మస్థానంపై నెలకొన్న వివాదాన్ని చర్చించేందుకు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత పీఠంలో హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, టీటీడీ వర్గాలు సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండడంతో చర్చ అసంపూర్ణంగా ముగిసింది. దీనిపై కిష్కింధ సంస్థాన్‌కు చెందిన హనుమద్ జన్మస్థల తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్పందించారు.

హనుమంతుడి జన్మస్థల అంశం ప్రధాన ఇతివృత్తంగా సంస్కృత విద్యాపీఠంలో చర్చించామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. తమకు పంపా క్షేత్ర కిష్కింధ ఒక కన్ను అయితే, తిరుమల మరో కన్ను అని వివరించారు. అయితే, నేటి సమావేశానికి సంబంధించిన అజెండా బుక్ లెట్‌లో ఉన్న అంశాలపై ప్రస్తావనే లేదని గోవిందానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంజనేయుడి జన్మ తిథిపై స్పష్టత లేదన్నారు. హనుమంతుడి జన్మ తిథి అంటూ మూడు తిథులు ఎలా పెడతారని నిలదీశారు. ఈ అంశంపై టీటీడీ వాళ్లు ఎప్పుడైనా పంపా ప్రాంతానికి వచ్చారా? అసలు, దీనిపై టీటీడీ కమిటీకి అధికారం ఉందా? కమిటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు తిరుమల పెద్దజీయర్ స్వామిని అడిగారా? ఆ కమిటీలో పెద్దజీయర్ స్వామి ఎందుకు లేరు? రామానుజ సంప్రదాయం ప్రకారం ఆంజనేయస్వామి వారికి వివాహం చేస్తారా? ఎన్నో కల్పాలు, మన్వంతరాలు గడిచాక ఈ చర్చ ఏంటి? అంటూ గోవిందానంద టీటీడీకి ప్రశ్నల వర్షం కురిపించారు.

రామాయణం ప్రకారం కిష్కింధనే మారుతి జన్మస్థలం అని ఉద్ఘాటించారు. హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణకు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీకి ప్రామాణికత లేదని అన్నారు. అయినా, ధార్మిక విషయాలను నిర్ణయించాల్సింది ఎవరు? అని గట్టిగా అడిగారు. శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోఠి పీఠాధిపతులు, మధ్యాచార్యులు, తిరుమల పెద్దజీయర్, చినజీయర్ స్వాముల సమక్షంలో చర్చించాల్సిన అంశాలివి అని స్పష్టం చేశారు. సామాన్య భక్త జనాలను గందరగోళంలోకి నెట్టేలా టీటీడీ వాదనలు ఉన్నాయని గోవిందానంద విమర్శించారు. టీటీడీ తీసుకువచ్చిన బుక్ లెట్ పై తాము జీయర్ స్వాముల వద్దకు వెళతామని వెల్లడించారు. ధర్మం గురించి తేల్చాల్చింది ధర్మాచార్యులేనని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement