Sunday, September 8, 2024

Delhi | చమురు పంటల సాగులోనూ వివక్షే.. తెలంగాణకు నిధుల విడుదలలో చిన్నచూపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చమురు, పామాయిల్ విత్తనాల ఉత్పత్తికి సంబంధించి నిధులు విడుదలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోందని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. చమురు రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇందుకోసం ఉద్దేశించిన వివిధ పథకాల వివరాలు. దిగుమతి భారాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యలు, పామాయిల్, ఇతర ఆయిల్ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

పామాయిల్, ఇతర నూనె పంటల పథకాలకు గత ఐదేళ్లలో కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలేంటని ఆయన ప్రశ్నించారు. నామ ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జవాబిచ్చారు. చమురు విత్తనాల ఉత్పత్తికి సంబంధించి కేంద్ర జాతీయ ప్రాయోజిత పథకం “ఎన్ఎఫ్‌ఎస్ఎం – ఓఎస్ ” పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఉత్పాదకతను పెంచి, దిగుమతి తగ్గించడం, తద్వారా స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

- Advertisement -

అనంతరం నామ మాట్లాడుతూ…2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేటాయించి, విడుదల చేసిన నిధుల్లో కేంద్రం తీవ్ర వివక్ష చూపించారని ఆరోపించారు. 2019 -20లో రూ.1199.70 లక్షల కేటాయింపునకుగాను రూ.513.10 లక్షలు విడుదల చేశారన్నారు. 2020-21లో రూ.1310 లక్షలకు 180.59 లక్షలు మాత్రమే విడుదల చేయగా, 2021-22లో రూ.2342.20 లక్షలకుగాను కేవలం రూ.700.73 లక్షలు విడుదల చేయగా, 2022 – 23లో పైసా ఇవ్వలేదని ఆయన వివరించారు. గుజరాత్‌కు మాత్రం ఆయిల్ సీడ్స్ అంశంలో రూ.3251.50 లక్షలు కేటాయించారని నామ తెలిపారు.

న్యూఢిల్లీలో నామాతో ఖమ్మం న్యాయవాదుల భేటీ

న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని నామ నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. న్యాయవాదులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు బిల్లును చట్ట రూపంలో తీసుకువచ్చే అంశాన్ని పార్లమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యులు తాళ్లూరి దిలీప్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం న్యూఢిల్లీలో నామ నాగేశ్వరరావును కలిశారు.

ఖమ్మం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గొల్లపూడి రామారావు, న్యాయవాదులు తోటకూర శ్రీనివాసరావు, సింగం జనార్దన్‌గౌడ్, కొత్తగూడెం ఇంతియాజ్, చంద్రకాని గురు కృష్ణ, సుప్రీంకోర్టు న్యాయవాది పుల్లభట్ల చక్రపాణి తదితర న్యాయవాదులు ఎంపీతో భేటీలో పాల్గొన్నారు. తమ సమస్యలపై ఆయనకు లేఖ అందజేశారు. పార్లమెంట్ సమావేశాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం, నోటరీల అంశాలను లేవనెత్తుతానని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలను నామకు వివరించారు.

ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా న్యాయవాదులపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని, అన్ని రాష్ట్రాల్లో న్యాయవాదులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే 2021లో సెంట్రల్ నోటరీ కోసం న్యాయవాదుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారని, తెలంగాణ సంబంధించిన న్యాయవాదులు సుమారు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని, ఈ వ్యవహారాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని లాయర్లు ఎంపీ నామకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement