అమరావతి, ఆంధ్రప్రభ: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఉద్యోగుల పట్ల వివక్ష వైఖరి కనబరుస్తోందని, సుమారు 45 వేల మంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇవ్వకుండా పక్కన పెట్టే ప్రయత్నాలు మొదలు కావడంతో సంబంధిత ఉద్యోగ వర్గాల్లో ఆందోళన మొదలైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉద్యోగ జీవితంలో మొదటి అడుగులు వేస్తున్న వారిని ఈ విధంగా మానసిక ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రెండేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న అందరికీ ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంటనే ప్రొబేషన్ ప్రకటిస్తామని వారి నియామక సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామన్నారు. ప్రొబేషన్ ఇవ్వాలనే న్యాయమైన తమ డిమాండును నెరవేర్చాలని కోరుతూ గాంధేయ ధోరణిలో నిరసన తెలిపిన వారిని ప్రొబేషన్‌కు దూరంపెడుతున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు సంబంధించిన వన్ -టైమ్ సెటిల్మెంట్(ఓటీ-ఎస్)కు ప్రొబేషన్‌కు లింకుపెట్టి మరికొందరిని దూరంపెట్టడం నిజం కాదా అనడిగారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు వివరణ ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేస్తూ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరికీ ప్రొబేషన్ ప్రకటించాలని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.