Tuesday, November 19, 2024

క్రీడాకారుల పట్ల వివక్ష తగదు… మహారాష్ట్ర ప్రభుత్వంపై చిరాగ్‌ శెట్టి ఆగ్రహం

మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ చిరాగ్‌ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో నలుగురు ముంబై ఆటగాళ్లకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తన నివాసంలో ప్రత్యేకంగా సన్మానించారు. శాలువాలు కప్పి.. వినాయకుడి ప్రతిమలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా.. రూ. 11 కోట్ల నజరానా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరాగ్‌ శెట్టి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

క్రికెటర్లకు పెద్ద పీట వేసే షిండే సర్కారు.. తనలాంటి క్రీడాకారులను మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించాడు. క్రీడాకారుల పట్ల ఇలాంటి వివక్ష తగదని.. అందరినీ సమానంగా చూడాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు చిరాగ్‌ శెట్టి విజ్ఞప్తి చేశాడు.

”బ్యాడ్మింటన్‌లో థామస్‌ కప్‌.. క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచిన దానికంటే తక్కువేం కాదు. థామస్‌ కప్‌ ఫైనల్లో ఇండోనేషియాను ఓడించి టైటిల్‌ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిని. అంతేకాదు కప్‌ గెలిచిన జట్టులో ఉన్న ఏకైక మహారాష్ట్ర క్రీడాకారుడిని. వరల్డ్‌కప్‌ గెలిచిన క్రికెట్‌ స్టార్లను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సంతోషం.

కానీ నాలాంటి ఆటగాళ్ల శ్రమను కూడా గుర్తిస్తే బాగుంటుంది. క్రీడలన్నింటికీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వాలి. క్రికెటర్లను సత్కరించడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. అంతెందుకు బ్యాడ్మింటన్‌ ప్లేయర్లందరం కూడా టీవీలో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చూశాం. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవడం పట్ల గర్వపడుతున్నాం.

అయితే, గత రెండేళ్ల కాలంలో నేను కూడా గుర్తుంచుకోదగ్గ.. చిరస్మరణీయ విజయాలు సాధించాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను కనీసం అభినందించలేదు. ఎలాంటి క్యాష్‌ రివార్డు కూడా ప్రకటించలేదు. 2022 కంటే ముందు భారత బ్యాడ్మింటన్‌ జట్టు కనీసం సెమీస్‌ చేరిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది మేము ఏకంగా టైటిల్‌ గెలిచాం. అయినా తగిన గుర్తింపు కరువైంది” అని చిరాగ్‌ శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్‌..

కాగా చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డితో కలిసి బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ప్రఖ్యాత థామస్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్‌ సాధించాడు. సాత్విక్‌సాయిరాజ్‌తో కలిసి ఫ్రెంచ్‌ ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గెలిచాడు. అదే విధంగా.. మలేషియన్‌ సూపర్‌ 750, ఇండియా సూపర్‌ 750 ఫైనల్స్‌ చేరాడు. తదుపరి ఈ జోడీ ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement