ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఇందులో భాగంగాఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం ఇవాళ సభలో చర్చ జరగనుంది.
అయితే, కేజ్రీవాల్ ఆరు నెలల క్రితం కూడా ఒకసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇక, తమ పార్టీ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుందని ఆయన ఇటీవల ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉంది.. వారికి ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందన్నారు. దీంతో బీజేపీతో కలిస్తే తనపై కేసులు లేకుండా చేస్తామన్నారని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ చెక్కుచెదరకుండా పార్టీతోనే ఉన్నారనే విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.
ఇక, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ గత బుధవారం ఆరోసారి సమన్లు పంపింది. ప్రతిసారి సీఎం విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కక్ష సాధింపు చర్యగా ఆప్ పేర్కొంటోంది. కాగా, ఈనెల 15న ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, 21వ తేదీతో ముగియనున్నాయి.