న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాథమిక బాధ్యత రాష్ట్రానిదేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టంపై కేంద్ర బృందాలు పర్యటించి సహాయం అందించాలని కోరుతూ రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించిన తెలుగుదేశం సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. విపత్తు నిర్వహణ బాధ్యత రాష్ట్రాలదేనని, అయితే ఆ విపత్తు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పరిస్థితిని అంచనా వేసి కేంద్రం అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు.
ఈ ఏడాది గోదావరి నది వరదల కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటర్ మినిస్ట్రీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1,2522.80 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ. 940 కోట్లు కాగా ఏపీ ప్రభుత్వ వాటా రూ. 312.80 కోట్లు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వాటాలో మొదటి వాయిదా కింద ఇప్పటికే రూ. 470 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. కేంద్ర బృందం నివేదిక ఆధారంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు సాయం అందుతుందని తెలిపారు.