గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో రాహుల్ గాంధీకి నిరాశ ఎదురైంది.
2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ కు చెందిన మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు కూడా పడింది. సూరత్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. అయితే గుజరాత్ హైకోర్టులో కూడా రాహుల్ కు చుక్కెదురైంది. సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.