Wednesday, November 13, 2024

మాయమవుతున్న గుట్టలు..@సర్కారు ఖజానాకు భారీగా గండి, అభివృద్ధి పేరిట అక్రమ దందా.. !

పరిగి, (ప్రభ న్యూస్‌) : పుడమితల్లి గుండెలపై ఆధునిక యంత్రాలతో అక్రమార్కులు చిల్లులు వేస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. వందల ఏళ్లనాటి విలువైన చరిత్ర కలిగిన గుట్టలు మట్టి కుప్పలు మాయమవుతున్నాయి. పచ్చటి ప్రకృతి వనరులు అక్రమార్కుల చేతుల్లో కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంత దారుణానికి ఒడిగడుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా సర్కారుకు రావలసిన ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళుతుంది. అనుమతులు అనుమతులు జాన్తానైమాకు అధికారులు, నాయకుల అండదండలు ఉన్నాయి. అంటూ ప్రభుత్వ ప్రైవేటు భూములు, గుట్టలు, చెరువులు పురం తవ్వేస్తున్నారు. కొందరు అక్రమార్కులు అనుమతులు ఉన్నాయి అంటూనే నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయాల్లో, సెలవుదినాల్లో జెసిబి లతో తవ్వుతూ ట్విప్పర్‌ల ద్వారా మరిన్ని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్‌ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు. గ్రానైట్‌ కంకర క్వారీల మాదిరిగానే మొరం తవ్వకాలకు కూడా గనుల శాఖ నుండి అనుమతులు తీసుకోవాలి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అనుమతులు మంజూరు చేస్తారు. ప్రభుత్వ భూములు అయినా పట్టా భూములు అయినా నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు ఉంటాయి. పరిగి మండల పరిధిలోని రంగంపల్లి, రంగాపూర్‌, బసిరెడ్డిపల్లి, జాఫర్‌ పల్లి, లక్నపూర్‌, మాదారం గ్రామాలతోపాటు పూడూరు మండలం రాకంచెర్ల దోమ మండలంలోని ఊటుపల్లి తో పాటు పలు గ్రామాలలో మొరం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న పరిగి పట్టణంలో వెంచర్లు, ఇళ్ల కట్టడాలకు మొరం తరలిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు…

రహదారులు, ప్రభుత్వ భవన నిర్మాణాలు చెరువు కట్ట పనులు, మట్టి పనులు ఫార్మేషన్‌ రోడ్డు వేసేందుకు మొరం అవసరం. వీటి పేరున కొందరు అక్రమార్కులు ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములు, ఆహ్లాదంగా కనువిందు చేసే కొండలు, గుట్టలు వేస్తున్నారు. వరం తవ్వకాలతో ఏళ్లనాటి కొండలు గుట్టలు మాయమవుతున్నాయి. ఇలా పట్టణంలో కొందరు అక్రమార్కులు ప్రతి నిత్యం వందల టిప్పర్లు మొరం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక టిపర్‌ మొరం రూ.3000 దాకా ఉంది. ఈ లెక్కన రోజుకు ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో ఎక్కడ తవ్వకాలు జరిపిన ఒక హెక్టారుకు సుమారుగా 50000 గనుల శాఖ మరో 50 వేలు తపాలాశాఖ రిజిస్ట్రేష్రన్‌ కోసం చెల్లించాలి. విక్రయాలపై అదనంగా 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఇలా చెల్లించకపోవడంతో లక్షల్లో ప్రజాధనం ప్రభుత్వానికి రాకుండా అక్రమార్కుల పరం అవుతుంది. బహిరంగ మార్కెట్లో టిప్పర్‌ కు 25 వందల నుండి మూడు వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారు.

అధికారుల కనుసన్నల్లోనే..

మొరం విక్రయాలకు అలవాటు-పడిన కొందరు అక్రమార్కులు అదేపనిగా దందా కొనసాగిస్తున్నారు. వారికి కొమ్ముకాసే కొంతమంది చోటామోటా నాయకులకు. చూసిచూడనట్లు వ్యవహరించే అధికారులకు కొంత ముట్టజెపుతున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాలలో ఉన్న ఖనిజ సంపద కాపాడాల్సిన అధికారుల కనుసన్నల్లోనే మొరం అక్రమార్కుల పరం అవుతుంది. రంగంపల్లి బసిరెడ్డిపల్లి జాఫర్‌ పల్లె ఇలా ఎక్కడపడితే అక్కడ కొండలు గుట్టలు తవ్వేస్తున్నారు.

అనుమతులు ఇలా తీసుకోవాలి..

- Advertisement -

ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో మొరం తవ్వకాలు చేపట్టిన అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి. తవ్వకాలకు ముందుగా గనులు, భూగర్భ శాఖ జిల్లా కార్యాలయంలో అనుమతి పొందాలి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. స్థానికంగా ఇళ్ల నిర్మాణాలకు తక్కువ మొత్తంలో అవసరం ఉన్న తవ్వకాలను తాసిల్దార్‌ నుండి నిరభ్యంతర పత్రం ( ఎం ఓ సి ) తీసుకోవాలి అనంతరం మీ సేవా కేంద్రాల ద్వారా గనులు భూగర్భ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో లేదా నెల రోజుల కంటే ఎక్కువగా మొరం తవ్వకాలు జరపాలంటే జిల్లా కలెక్టర్‌ నుండి అనుమతి పొందాలి. ముందు భూగర్భ శాఖ, కాలుష్య నియంత్రణ, బిఎఫ్‌ఓ, ఆర్‌ డి ఓ, తహసిల్దార్‌ అనుమతులు కోరాలి. వారు స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం వారి ఆమోదంతో కలెక్టర్‌ కు నివేదిక అందజేస్తారు. ప్రైవేటు భూముల్లో అయితే సంబంధిత పట్టాదారు ఆమోదం కూడా పొందాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement