వారిసు చిత్రానికి తెలంగాణ..ఆంధ్రాలో థియేటర్స్ దొరకకపోతే తెలుగు సినిమాలు అనేక రకాలుగా ఇబ్బందిపడాల్సి వస్తుందని హెచ్చరించారు తమిళ దర్శకుడు లింగుస్వామి.. యావరేజ్ న తమిళ సినిమాల రెవిన్యూ ఇరవై శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుంది. ఈ నేపధ్యంలో ఇలా లింగుస్వామి వార్నింగ్ ఇవ్వటం అంతటా చర్చనీయాంశంగా మారింది. తమిళ దర్శకులను మనవాళ్లు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతూంటే వాళ్లు తిరిగి తెలుగు వాళ్లకే వార్నింగ్ ఇచ్చే స్దితికి వచ్చారని అంటున్నారు.
మరో ప్రక్క సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారు. ఒకవేళ తెలుగులో డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా తమిళంలో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్‌లో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే పని కాదని ‘తోడేలు’ ఈవెంట్లో అల్లు అరవింద్ అన్నారు. డబ్బింగ్ సినిమాల రిలీజ్‌లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్‌లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరుతూ లేఖ రాశాం అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ వెల్లడించారు.