హైదరాబాద్ – ప్రముఖ దర్మక నిర్మాత కె వాసు నేడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రిందటే ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా మన మెగాస్టార్ చిరంజీవిని ఆడియన్స్ కి పరిచయం చేసింది ఈ దర్శకుడే. చిరంజీవి ‘ప్రాణంఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది కె వాసునే. ఆ తరువాత కూడా చిరుతో కలిసి కోతలరాయుడు, తోడు దొంగలు, అల్లులొస్తున్నారు.. వంటి సినిమాలు కూడా చేశారు.
ఇక డివోషనల్ మూవీస్ లో ఒక క్లాసిక్ గా ఉన్న విజయ చందర్ ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ని కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. అలాగే ‘అయ్యప్ప స్వామి మహత్యం’ని కూడా వాసునే డైరెక్ట్ చేశారు. ఇక బ్రహ్మానందంని హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన వ్యక్తి కూడా ఈయనే. ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ సినిమాలో బ్రహ్మానందంని హీరోగా చూపించారు. చివరిగా శ్రీకాంత్, ప్రభుదేవాలతో ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ చిత్రాన్ని తీసి హిట్ అందుకున్నారు