Friday, November 22, 2024

డిజిటల్ చెల్లింపులదే భవిష్యత్తు.. యూపీఐ-పే నౌ అనుసంధానం కార్యక్రమంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులే సింగభాగం ఆక్రమించుకుంటాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్వరలో నగదు లావాదేవీలను డిజిటల్ చెల్లింపులు అధిగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-సింగపూర్ దేశాల మధ్య డిజిటల్ మనీ ట్రాన్స్‌ఫర్ విధానాలను అనుసంధానించే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నగదు లావాదేవీల స్థానంలో డిజిటల్ విధానాల్లో చెల్లింపులు జరిపేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యూనిఫైడ్ పెమెంట్స్ ఇంటర్‌ఫేస్’ (యూపీఐ)ను సింగపూర్‌కు చెందిన ‘పేనౌ’తో అనుసంధానిస్తూ రియల్‌టైమ్ పేమెంట్ లింకేజిని భారత ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ ఎండీ రవి మేనన్ పాల్గొన్నారు. ఈ ఇద్దరూ తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి క్రాస్ బార్డర్ లావాదేవీలను జరిపారు. తద్వారా రెండు దేశాల్లో నివసించే వేర్వేరు వ్యక్తుల మధ్య నేరుగా నగదు బదిలీ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి దేశాల్లో సింగపూర్, భారత్ నిలిచాయి.

ఈ సదుపాయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ… భారత్‌ నేరుగా జరిపే డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో యూపీఐ విధానంలో చెల్లింపులు నానాటికీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. 2022లో భారత్‌లో మొత్తం 7,400 కోట్లకు పైగా డిజిటల్ చెల్లింపులు జరిగాయని, వీటి మొత్తం విలువ రూ. 126 లక్షల కోట్లకు పైనేనని వెల్లడించారు. యూపీఐ (ఇండియా) – పే నౌ (సింగపూర్) అనుసంధానంతో రెండు దేశాల ప్రజలు సులభంగా, సురక్షితంగా, వేగవంతంగా డిజిటల్ చెల్లింపులు జరుపుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా సింగపూర్‌లోని వలస కార్మికులుగా, విద్యార్థులుగా ఉన్న భారతీయులు తక్కువ ఖర్చుతో చెల్లింపులు జరుపుకోవచ్చని అన్నారు. ఇది రెండు దేశాల ప్రజలకు ఒక బహుమతి అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. భారత్-సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక రంగంలో సాంకేతిక రంగం మరో ఎత్తుకు చేరుకుందని అన్నారు. మరిన్ని దేశాలతో భారత యూపీఐ విధానాన్ని అనుసంధానిస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత డిజిటల్ వ్యవస్థ ప్రపంచీకరణ చెందుతోందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement