Friday, November 22, 2024

టీవీ బోధన షురూ! తెలంగాణలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు..

*టీవీ పాఠాలను వీక్షించనున్న 6 లక్షల మంది విద్యార్థులు

విద్యార్థులకు ఆన్‌లైన్‌, డిజిటల్‌ తరగతులను ప్రభుత్వం ప్రారంభించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు షురూ అయ్యాయి. మొన్నటి వరకు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరైన విద్యార్థులు కరోనా నేపథ్యంలో ఇక నుంచి టీవి పాఠాలు విననున్నారు. ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో 26,065 వరకు ఉన్నాయి. ఇందులో మొత్తం విద్యార్థులు సుమారు 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. ఇందులో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు సుమారు 6లక్షల మంది వరకు ఉంటారు. అయితే వీరందరూ దూరదర్శన్‌ టీశాట్‌ ఛానళ్ల ద్వారా పాఠాలు విననున్నారు. విద్యార్థులు ఇంట్లో ఉంటూనే స్మార్ట్‌ ఫోన్‌, టీవీల ద్వారా పాఠాలు వినడం, చూడటం ద్వారా నేర్చుకోవలసి ఉంటుంది. అయితే టీవీలు, నెట్‌ సౌకర్యం, స్మార్ట్‌ ఫోన్లు లేని విద్యార్థుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై అధికారుల నుంచి స్పష్టత కరువైంది.
కరోనా, ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఈనెల 8 నుంచి 16 వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 17న పున:ప్రారంభం కావాల్సిన స్కూళ్లకు మళ్లి సెలవులను పొడిగిస్తూ ఈనెల 30వరకు సెలవులను ఇచ్చింది. అయితే విద్యార్థులు తమ అకడమిక్‌ ఇయర్‌ను నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులను సార్ట్‌ చేసేందుకు తాజా నిర్ణయం తీసుకుంది. అయితే గ్రామీణా ప్రాంత విద్యార్థుల కంటే పట్టణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు కాస్త వసతులు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

గ్రామీణా ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగించడం, డిజిటల్‌ విద్యావిధానంపై అవగాహన లేకపోవడంతో దాని ప్రభావం విద్యార్థుల చదువులపై పడనుంది. ఇదిలా ఉంటే చాలా వరకు ప్రైవేట్‌ స్కూళ్లు మాత్రం ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించేశాయి. గతేడాది కూడా కరోనా తీవ్రత కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడంతో ఆన్‌లైన్‌ విద్యను సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభించారు. అయితే అప్పుడు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యా యుల నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం అప్పట్లో సేకరించింది. కానీ ప్రస్తుతం ఆ వివరాలను సేకరించలేదని తెలుస్తోంది. టీశాట్‌ ద్వారా పాఠాలను ఎంతమంది చూస్తారనే దానిపై ఎలాంటి అంచనాల్లేవు. మరోవైపు కేబుల్‌ కనెక్షన్లు ఉన్నప్పటికీ నిర్దేశించిన సమయాల్లో చూసి అవగాహన చేసుకునే దానిపైనా స్పష్టత లేదు. గతంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహించేవారు.

ఒక్కో క్లాసు సమయం గరిష్టంగా అరగంట వరకు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం క్లాసుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ను మాత్రం విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ బోధనను కొనసాగించనున్నట్లు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. ఈ రోజు నుంచి హైస్కూల్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విధులకు సిబ్బంది హాజరు కానున్నారు. అయితే 50 శాతం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రొటేషన్‌ పద్ధతిలో బడులకు హాజరు కావాలని శనివారం అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులందరూ క్లాసులను ఉపయోగించుకునేలా చూసే బాధ్యత టీచర్లపైనే అధికారులు ఉంచినట్లు తెలిసింది. టీవీలు, ఫోన్లు లేని వారికి గ్రామాల్లోని కమ్యూనిటీ, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో డిజిటల్‌ క్లాసులకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement