రష్యా చేస్తున్న భూమి, ఆకాశంతో పాటు సముద్ర మార్గాల దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతూనే ఉంది. దీనికితోడు రష్యా ఐటీ వ్యవస్థను మరింత ఛిన్నాభిన్నం చేసేందుకు ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఉక్రెయిన్‌లోని ఐటీ నిపుణులందరినీ ఓ చోట చేర్చి.. డిజిటల్ ఆర్మీగా ఏర్పాటు చేసింది. వీరంతా.. రష్యాకు సంబంధించిన ఐటీ వ్యవస్థపై సైబర్ దాడులు చేస్తున్నారు. ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఉక్రెయిన్‌లో ఎంతో మంది ఐటీ నిపుణులు ఉన్నారని, వీరంతా.. దేశ రక్ష కోసం ఆయుధం చేతపట్టకుండా.. సైబర్ వేదికగా రష్యాపై దాడికి దిగుతున్నారని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉక్రెయినియన్‌లు సైతం డిజిటల్ ఆర్మీలో పని చేస్తున్నారు. వివిధ దేశాల్లో ఐటీ నిపుణులుగా పని చేస్తున్న 66వేల మంది ఉక్రెయినియన్‌లు స్వదేశానికి చేరుకున్నారు. వీరంతా కలిసి రష్యాపై చేస్తున్న సైబర్ దాడుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
రంగంలో ఐటీ నిపుణులు..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్‌లైన్ యాడ్ బయ్యర్లు సైబర్ ఆర్మీలో భాగస్వాములుగా ఉన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా గ్రాఫిక్స్ తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వీరి పని. అదేవిధంగా యుద్ధం వల్ల సంభవిస్తున్న నష్టాన్ని కూడా ప్రపంచానికి తెలియజేసేందుకు వీరు ఉపయోగపడుతున్నారు. చనిపోయిన రష్యా సైనికుల ఫొటోలు, వారు పడుతున్న బాధలు, ఇబ్బందులను చిత్రీకరించి, ఫొటోలు తీసి రష్యాలో ప్రసారం అయ్యేలా చేస్తున్నారు. డిజిటల్ ఆర్మీలో పని చేస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తామంతా ఓ బృందంగా ఏర్పడి.. రష్యాపై సైబర్ దాడులకు దిగుతున్నామని వివరించారు. స్టాండ్ ఫర్ ఉక్రెయిన్ పేరిట ఈ సైబర్ యుద్ధం చేస్తున్నామని తెలిపారు. రష్యా వెబ్‌సైట్ల సేవలను అడ్డుకోవడంతో పాటు టెలిగ్రాం ఛానెల్స్‌లో ప్రత్యేక బోట్లను నిర్వహించడం చేస్తున్నామన్నారు.
కీలక సమాచారం సేకరణ..
ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న రష్యా ఆర్మీ ఫొటోలు, వారి కదలికలు, ఆయుధ సామాగ్రి వంటి కీలక అంశాలను సేకరించి.. ఉక్రెయిన్ ఆర్మీకి అందజేస్తున్నట్టు తెలిపారు. రష్యా మీడియా, రైల్వేలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ దాడి చేస్తున్నది. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థను కూడా హ్యాక్ చేసినట్టు తెలిపింది. రైలు టికెట్ల జారీ వ్యవస్థను కూడా పని చేయకుండా చేసినట్టు వివరించింది. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం కలిగించామని ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ ప్రకటించింది. అయితే రష్యా సైబర్ స్పేస్ దాడులను మాత్రం తాము నిరోధిస్తున్నామని, ఇలాంటి వాటిని ప్రోత్సహించడం లేదని, ఇది భారీ విధ్వంసానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. రష్యా కూడా ఉక్రెయిన్‌పై సైబర్ దాడులకు దిగుతున్నది. ఉక్రెయిన్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలను కూడా నిరోధించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..