ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో డాలర్ తిరుగులేని ఆధిపత్యం కలిగి ఉంది. కొవిడ్ తరువాత ఆర్ధిక వ్యవస్థల మందగమనం, ఆర్ధిక వ్యవస్థల మందగమనం వంటి కారణాలతో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను భారీగా పెంచుతున్నది. దీని వల్ల ఇతర దేశాల కరెన్సీలతో డాలర్ బలపడుతోంది. దీని వల్ల చాలా దేశాల దిగుమతుల బిల్లు భారీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌కు ప్రత్యామ్నాయాలు చూస్తున్నాయి. ఇప్పటికే మన దేశం రష్యాతో రూపాయల్లోనే వాణిజ్యం నిర్వహించాలని నిర్ణయిచింది. ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని దేశాలు కూడా మనతో రూపీలోనే వాణిజ్యం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా ఉన్న దేశాలతో పాటు, చిన్న దేశాలు కూడా విదేశీ వాణిజ్యంలో డాలర్‌కు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. ఒక్క ఆసియాలోనే 12 దేశాలు ఇదే బాటలో ఉన్నాయి. అమెరికా డాలర్, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థను సరిగా ఉపయోగించుకోవడంలో జో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని మిలీనియం వేవ్ అడ్వైజర్స్ ప్రెసిడెంట్, పెట్టుబడుల వ్యూహకర్త జాన్ మాల్డిన్ అభిప్రాయపడ్డారు. ఆయనకు మార్కెట్‌లో అపార అనుభవం ఉంది. అమెరికాయేతర పెట్టుబడిదారులు, దేశాలు, సంప్రదాయ సురక్షిత స్వర్గధామంగా పిలుచుకునే అమెరికాకు బదులు తమ పెట్టుడులను బయటే పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు.
ద్వైపాక్షిక వాణిజ్య చెల్లింపులు
రష్యా, చైనాలు తమ కరెన్సీలను అంతర్జాతీయ చెల్లింపులకు వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించుకుని చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తరువాత అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాతో వాణిజ్యంలో డాలర్ల వినియోగాన్ని నిషేధి ంచాయి. దీంతో రష్యా తాను సరఫరా చేస్తున్న ఆయిల్, గ్యాస్‌కు రూబుల్స్‌లోనే చెల్లించాలని కోరుతున్నది. బంగ్లాదేశ్, కజకిస్థాన్, లావోస్ వంటి దేశాలు కూడా చైనాకు యూవాన్‌ల్లోనే చెల్లించేందుకు చర్చలు జరుపుతున్నాయి.
రష్యా, చైనాలు డాలర్ స్థానంలో తమ కరెన్సీనే చలామణి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ చర్య చాలా చిన్న దేశాలకు బాగా కలిసి వస్తోంది. ఈ దేశాలతో పాటు మన దేశం కూడా రూపాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. డిసెంబర్‌లో మన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో ద్వైపాక్షిక చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది. రష్యాతోనూ రూపాయల్లోనే వాణిజ్యం నిర్వహిస్తోంది. ఇందు కోసం మన దేశం ప్రత్యేకంగా వోస్ట్రో అకౌంట్స్ ప్రారంభించింది. రూపాయాల్లో వాణిజ్యం చేసేందుకు మన దేశం ఇప్పటికే ఐదు దేశాలకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక తో సహా మరికొన్ని దేశాలు కూడా ఆర్బీఐని అనుమతి కోరుతున్నాయి. చైనా 2022 ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 49.1 శాతం మేర తన కరెన్సీలోనే విదేశీ చెల్లింపులు, స్వీకరణలు చేసింది. ఇండోనేషియా కూడా తమ స్థానిక కరెన్సీలో దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్‌లతో సెటిల్‌మెంట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. లావోస్‌లోని కేంద్ర బ్యాంక్ వాణిజ్య బ్యాంక్‌లు విదేశీ కరెన్సీలను విక్రయించడాన్ని నిషేధించింది.
బలోపేతమైన డాలర్
బ్లూమ్ బర్గ్ డాలర్ సూచీ ప్రకారం ఈ సంవత్సరం అమెరికా డాలర్ 7 శాతం బలపడింది. 2015 నుంచి డాలర్ వార్షిక వృద్ధిరేటు ఇదే అత్యధికం. డాలర్ విలువ సెప్టెంబర్‌లో రికార్డ్ స్థాయికి చేరింది. దీంతో మన రూపాయితో పాటు, బ్రిటిష్ ఫౌండ్ కూడా కనిష్టాలకు చేరాయి. డాలర్ బలోపేతం కావడం ఆసియా దేశాలకు నష్టంగా మారింది. ఆహార పదార్ధాల ధరలు పెరుగుతున్నాయి. విదేశీ వాణిజ్య అప్పులు తిరిగి చెల్లించడం కార్పొరేట్లకు భారంగా మారుతున్నది. చాలా దేశాల్లో పేదరికం పెరుగుతున్నది. శ్రీలంక డాలర్లలో రుణాలు తీర్చలేక డిఫాల్ట్ అయ్యింది. కరన్సీలో కింగ్‌గా ఉన్న డాలర్ ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దాని డామినేషన్‌ను చాలా దేశాలు ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అనేక అంతర్జాతీయ కారణాల మూలంగా చాలా దేశాలు తమ సొంత కరెన్సీతోనే వాణిజ్య జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు డాలర్‌కు వచ్చిన ఇబ్బందిలేకున్నా… ముందు ముందు ఈ దేశాల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.
డాలర్‌కు మాత్రం రానున్న సంవత్సరాల్లో చాలా దేశాల మార్కెట్ల నుంచి, కరెన్సీల నుంచి సవాల్ ఎదురు కానుంది. ఈ క్రమంలోనే ఆయా దేశాలు తమ కరెన్సీ విలువ పెంచుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నాయి. ఈ దేశాలకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మంచి అవకాశం వచ్చింది. రష్యాపై ఆంక్షలతో యూరోపియన్ దేశాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలకు చమురు, గ్యాస్, గోధుమలు, బార్లీ వంటి వాటిని ఎగుమతి చేస్తున్న రష్యా తనకు రూబుల్స్‌లోనే చెల్లించాలని కోరుతున్నది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థలో అమెరికా జోక్యం పెరగడం కూడా డాలర్‌కు ప్రత్యామ్నాయాలు వెతికేందుకు దోహదం చేస్తున్నది.