Friday, November 22, 2024

అప్పన్న దర్శనానికి అష్టకష్టాలు.. సామాన్య భక్తులకు చుక్కలు

విశాఖపట్నం, ఆంధ్రప్రభబ్యూరో : ఏడాదికి ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే సింహాద్రి అప్పన్నను కనులారా తిలకిద్దామని వచ్చిన సామాన్య భక్తులకు చుక్కలు కన్పించాయి. అధికారయంత్రాంగం వైఫల్యం వల్ల భక్తులంతా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఊహించినదానికన్నా పెద్దసంఖ్యలో భక్తులు రావడం, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు లేకపోవడం, ఇష్టారీతిన టిక్కెట్లు విక్రయించడం, అంతరాలయ దర్శనానికి అనుమతించడం వంటి కారణాలవల్ల భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సింహాచలంలో కొలువైన వరాహలక్ష్మీనృసింహ స్వామివారి నిజరూప దర్శనవేళ.. చందనోత్సవం శాస్త్రోక్తంగా సాగినప్పటికీ భక్తులు స్వామివారి దర్శనాన్ని మాత్రం తనివితీరా చేసుకోలేకపోయారు.

ఆదివారం తెల్లవారు జామున 3.15 గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు కమిషనర్‌ సత్యనారాయణ క్యూలైన్లలో భక్తులకు స్వామి దర్శనాలు ప్రారంభించారు. ఇక అక్కడ నుంచి నిరంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తూ వచ్చారు. అయితే గత చందనోత్సవాల అనుభవాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రూ.1500 ప్రత్యేక టిక్కెట్‌పై భక్తులకు స్వామి అంతరాలయం దర్శనం కల్పించారు. ఇదే ప్రధానంగా చందనోత్సవంలో ఇబ్బందికరంగా మారింది. అంతరాలయంలోకి ప్రవేశించిన భక్తులు తిరిగి వెనక్కి రావడానికి అత్యధిక సమయం పట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున అంతరాలయంలో భక్తులను పంపించేందుకు నిరంతరం కృషి చేసినా సామాన్య భక్తులు వేచి ఉండే క్యూలైన్లు ముందుకు సాగలేదు. 2 నుంచి 4 గంటల పాటు భక్తులు క్యూలైన్లలో మండుటెండలో వేచి ఉన్నారు. దీంతో పాటు వీవీఐపిలు, ప్రోటోకాల్‌ ప్రముఖులు, న్యాయవాదులు ఇలా అంతా స్వామిని దర్శించుకోవడానికి మరో వైపు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంత వేగంగా స్వామి దర్శనం సామాన్య భక్తులకు కల్పిద్దామని వేచి చూసినప్పటికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మరో వైపు రూ.1500 టిక్కెట్లు ఇష్టారాజ్యంగా జారీ చేయడం, వారంతా అంతరాలయంలోకి స్వామిని దర్శించుకోవడానికి వె ళ్లి తిరిగి వచ్చే సమయంలో క్యూలైన్లలో ఉండిపోవడం ఇక రూ.1000 లైను ఘాట్‌రోడ్డులోనూ కొనసాగింది. ఏది ఏమైనా సామాన్య భక్తులకు చందనోత్సవంలో చుక్కలు కనిపించాయి. మరో వైపు ఆలయంతో పాటు సింహగిరిపై ఎటు చూసినా భక్తులు కోలాహలం కనిపించింది. ఘాట్‌రోడ్డు పొడవున వాహనాలు బారులుతీరి ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఇందులో అనేక మంది ప్రముఖులు గంటల తరబడి వేచి చూడాల్సి తప్పలేదు. అయితే సింహగిరిపై అత్యధికంగా సామాన్య భక్తులకు స్వామి దర్శనం సకాలంలో కలగకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం 10 గంటల తరువాత అంతరాలయం దర్శనాలు నిలిపివేసి మహా లఘుదర్శనాన్ని ప్రారంభించారు. ఆ తరువాత క్యూలైన్లు వేగవంతంగా కదిలాయి. అయితే నిరంతరం భక్తులు రద్దీ అధికమవ్వడం కూడా ప్రధాన కారణం.

- Advertisement -

మంత్రులకు సెగ

స్వామిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఒక దశలో తమకు కనిపించే అమాత్యులందరిని నిలదీసే ప్రయత్నం చేశారు. అసలే అష్టకష్టాలుపడి ట్రాఫిక్‌ ఇక్కట్లు ఎదుర్కొని సింహగిరికి చేరుకుంటే తదుపరి స్వామిని గంటల తరబడి దర్శించుకోలేకపోతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఇవో త్రినాధరావులు సైతం భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి వారు వినే పరిస్థితి కనిపించలేదు. అసలు ఎన్ని వాహనాలకు పాసులు జారీ చేశారన్నది స్పష్టత లేదు. మరో వైపు అత్యధికంగా పోలీసు, వివిధ విభాగాల అధికారుల, ఇతర ప్రముఖుల వాహ నాలతోనే సింహగిరి నిండిపోయింది.

వాస్తవంగా 300 వాహనాలనే అనుమతిస్తామని ముందుగా అధికారులు ప్రకటించినప్పటికి వివిధ విభాగాల అధికారుల వాహనాలు అన్ని ఉన్నాయి. ఇక ప్రముఖుల వాహనాలకు చోటు లేకుండా పోయింది. అయితే గత ఏడాది చందనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఏడాది అంచనాకంటే భక్తులు అధికంగా రావడం, అంతరాలయ దర్శనాలు కల్పించడం, సరిగా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించలేకపోవడం, సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి దర్శన భాగ్యం కల్పించకపోవడం, కనీస సదుపాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడం ఇలా అన్నీ కలిసి చందనోత్సవంలో లోటుపాట్లుగా కనిపించాయి. ఏది ఏమైనా అత్యధిక శాతం భక్తులు స్వామిని దర్శించుకోవడం జరిగింది.

వివిఐపిలు, ప్రోటోకాల్‌ ప్రముఖులు, ఇతర అతిధులుకు మర్యాదలు చేయడం ఒక వైపు, మరో వైపు క్యూలైన్లను వేగవంతంగా కదిలించాల్సి రావడం వల్ల కొంత మేరకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా భారీ ఎత్తున వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది డిప్యూటేషన్‌లపై నియమించడంతో భక్తులతో పాటు సేవలందించిన వారు , ఇతర విధులు నిర్వహించిన వారు అత్యధిక శాతం కనిపించారు. ముందుగా ధర్మకర్తల మండలి సభ్యులకు అన్ని జాగ్రత్తలు చెప్పిన అధికారులు మాత్రం ఉత్సవాన్ని సజావుగా విజయవంతం చేయలేకపోయారన్న అపవాదను మూటకట్టుకున్నారు. దీంతో అమాత్యులు, అధికార యంత్రాంగం ఎంతగా కృషి చేసినా చివరకు విమర్శలు ఎదుర్కోక తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement