Saturday, November 23, 2024

రాష్ట్రంలో విభిన్న వాతావరణం.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం ఈదురుగాలులతో వాన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుండగా… పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌ నగరంతోపాటు పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షాలు కురిసాయి. మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగా ఉండి… సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారి పోయింది. ఈదరుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరింవచారు. ఒకే రోజులో రెండు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది.

- Advertisement -

అయిదు రోజులపాటు వర్షసూచన…

రాగల అయిదు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

ఆదివారం నుంచి సోమవారం వరకు కొమరంభీమ్‌ ఆసీఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నుంచి జూన్‌ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, పలుచోట్ల ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది.

హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన…

హైదరాబాద్‌లో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన నగరవాసులు నాలుగు గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఉపశమనం పొందారు. ఆ వెంటనే ఈదురుగాలులతో కూడిన వర్షం నగరంలోని పలు చోట్ల కురిసింది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట్‌, యూసఫ్‌గూడ, ఖైరతాబాద్‌, కేపీహెచ్‌బీ, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో , ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జాం నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హైదరాబాద్‌ నగరంతోపాటు నాగర్‌కర్నూలు జిల్లాలో పలు చోట్ల 0.2 మి.మీ. చొప్పున, నల్గొండ జిల్లాలో 0.2 మి.మీ. చొప్పున, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో 0.1 మి.మీ మేర వర్షపాతం నమోదైంది.

రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు…

రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీలు, భద్రాచలంలో 42.4 డిగ్రీలు, హకీంపేటలో 36.6, దుండిగల్‌లో 38.3, హన్మకొండలో 40.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39.1 డిగ్రీలు, ఖమ్మంలో 42.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 40 డిగ్రీలు, మెదక్‌లో 41, నల్గొండలో 42.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 41.4 డిగ్రీలు, రామగుండంలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement