కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్నాక కొందరిలో డయాబెటిస్ వ్యాధి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలికమా లేక శాశ్వతంగా ఉంటుందా? అనేది ఆరు నెలలు ఆగితే చెప్పగలమంటున్నారు. కోవిడ్ వైరస్ క్లోమగ్రంథిపై ఉండే బీటా కణాలపై దాడి చేయడంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందని, అప్పుడు శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ వస్తోందని తెలిపారు. అటు కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్ల వాడకం కూడా దీనికి ఓ కారణం అంటున్నారు. కోవిడ్ సోకిన 7 రోజుల తర్వాత, ఆక్సిజన్ స్థాయి 92 కంటే తగ్గితేనే స్టెరాయిడ్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోవిడ్ సోకిన సుమారు 10 శాతం రోగుల్లో మధుమేహం లక్షణాలు కనిపిస్తున్నాయని ముంబైలోని కెమ్ హాస్పిటల్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్ షివానే చెప్పారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువ అని… కానీ, కోవిడ్ వల్ల మధుమేహం బారిన పడుతున్న కేసులు కూడా ఉన్నాయని నిపుణులు ధ్రువీకరించారు.